
న్యూఢిల్లీ, వెలుగు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆర్బీఐ రూల్స్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలపై మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చర్యలు తీసుకునేందుకు 2006లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడేందుకని ఈ వ్యవహారాల పరిశీలనకు ఆప్పటి ఆర్థికశాఖ సలహాదారు రంగాచారిని అపాయింట్ చేసింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఐడీకి అప్పగించింది. హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న సీసీ నెంబర్ కొట్టి వేయడంతోపాటు, క్రిమినల్ ప్రోసిడింగ్స్‌పై స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ, లాయర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎమ్మార్ షాతో కూడిన బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడంతోపాటు ఆర్బీఐ ప్రత్యేక అధికారిని విచారణలో భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.