ఢిల్లీ అధికారాల‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఢిల్లీ అధికారాల‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

supreme court judgment on delhi government vs LGఢిల్లీలో అధికారాలపై కొంతకాలంగా కేజ్రీవాల్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఏసీబీ అధికారులు ఎవరి ఆదేశాలు పాటించాలన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం, సర్వీసులను నియంత్రించడం వంటి విషయాలపై పెద్ద వివాదమే నడిచింది. ఆ వ్యవహారం సుప్రీం కోర్టు చేరడంతో విచారించిన అత్యున్నత న్యాయస్థానం గతేడాది నవంబర్ 1న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. మొత్తానికి ఇవాళ (గురువారం 14/02/19) తీర్పు వెలువరించింది.

ఢిల్లీ పరిధిలోని అధికారాల విషయంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏసీబీ, విచారణ కమిషన్ వంటివి లెఫ్టినెంట్ గవర్నర్ నియంత్రణలోనే ఉంటాయని సుప్రీ కోర్టు క్లారిటీ ఇచ్చింది. సర్వీసుల విషయంలో ద్విసభ్య ధర్మాసనంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఢిల్లీ అధికారాల విషయంలో వివాదం ఉన్న ఆరు అంశాలపై సుప్రీం తీర్పు ఇచ్చింది. కీలకమైన ఏసీబీ, విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉంటాయని సుప్రీం క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ శాఖ, రెవెన్యూశాఖలపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కోర్టు వెల్లడించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర న్యాయ అధికారుల నియామకాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వమే చేపడుతుందని క్లారిటీ ఇచ్చింది. వ్యవసాయ భూముల ధరలు ప్రభుత్వమే సవరించుకోవచ్చని తెలిపింది. అయితే సర్వీసులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న అంశంపై న్యాయమూర్తులు జస్టిస్ సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ విషయంపై త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెబుతుందని సుప్రీం తెలిపింది.