మైనర్ల ఆస్తి అమ్మాలంటే కోర్టు పర్మిషన్ మస్ట్ : సుప్రీం కోర్టు కీలక తీర్పు

మైనర్ల ఆస్తి అమ్మాలంటే కోర్టు పర్మిషన్ మస్ట్ : సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: మైనర్ల పేరుపై ఉన్న ఆస్తుల విక్రయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. మైనర్ కొడుకు/కూతురు పేరుపై ఉన్న ఆస్తిని అమ్మాలన్నా, ఇతరులకు బదిలీ చేయాలన్నా తల్లిదండ్రులు (నేచురల్ గార్డియన్స్) తప్పనిసరిగా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపింది. తల్లిదండ్రులు కోర్టు నుంచి అనుమతి తీసుకోకుండా మైనర్ల ఆస్తిని అమ్మినట్లయితే..  మైనర్లు మేజర్ అయిన తర్వాత ఆ సేల్‌ డీడ్‌ను రద్దు చేసేందుకు కోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

 అదే ఆస్తిని స్వతంత్రంగా ఇతరులకు అమ్మడం గానీ, బదిలీ చేయడం గానీ చేయొచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేఎస్ శివప్ప వర్సెస్ కె.నీలమ్మ కేసులో జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన బెంచ్ ఈ నెల 7న తీర్పు ఇచ్చింది. 1971లో కర్నాటకలోని దావణగెరెకు చెందిన రుద్రప్ప తన ముగ్గురు మైనర్ కొడుకుల పేరు మీద రెండు ప్లాట్లు కొన్నాడు. 

అయితే లోకల్ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోకుండా 1983లో వేరే ఇద్దరికి వాటిని అమ్మాడు. కానీ ఆయన కొడుకులు మేజర్ అయిన తర్వాత అవే ప్లాట్లను కేఎస్ శివప్పకు 1989లో విక్రయించారు. అయితే రుద్రప్ప నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన ఇద్దరు హైకోర్టుకు వెళ్లగా.. వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రుద్రప్ప చేసిన సేల్ డీడ్స్ ను రద్దు చేయాలని ఆయన కొడుకులు పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టు పేర్కొంది. దీనిపై కేఎస్ శివప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా రుద్రప్ప కొడుకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.