కొల్ కతా సీపీ విచారణకు హాజరుకావాల్సిందే: సుప్రీంకోర్టు

కొల్ కతా సీపీ విచారణకు హాజరుకావాల్సిందే: సుప్రీంకోర్టు

కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విషయంలో… కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేయకూడదని సీబీఐని ఆదేశించిన సుప్రీం… విచారణకు హాజరుకావాలని రాజీవ్ కు సూచించింది. విచారణ ఢిల్లీ, కోల్ కతాల్లో కాకుండా తటస్థంగా ఉండేలా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో జరగాలని చెప్పింది.

పశ్చిమ బెంగాల్ పోలీసులు, సీబీఐ మధ్య ఏర్పడిన ఘర్షణలకు సుప్రీంకోర్టు తెరదించింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ ముందు హాజరై, సహకరించాలని కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ఆదేశించింది సుప్రీం. ఢిల్లీ లేదంటే కోల్ కతాలో కాకుండా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని సీబీఐ ఆఫీస్ లో రాజీవ్ కుమార్ ను ప్రశ్నించాలని సూచించింది. అదేసమయంలో ఆయన్ని అరెస్టు చేయకూడదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ సీబీఐని ఆదేశించింది.

బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్ కతా పోలీస్ కమిషనర్  లకు వ్యతిరేకంగా సీబీఐ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ లపై ఈ నెల 18లోగా సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది. తర్వాతి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, బెంగాల్ పోలీసుల తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. చిట్ ఫండ్ కుంభకోణం కేసును సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించిందని గుర్తుచేసిన కేకే వేణుగోపాల్, కేసు దర్యాప్తులో కోల్ కతా కమిషనర్ సహకరించడం లేదని ఆరోపించారు. ఆ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్ కు నేతృత్వం వహించిన రాజీవ్ కుమార్ తనవద్దనున్న పత్రాలను సీబీఐకి అప్పగించలేదన్నారు. కొన్ని పత్రాలను తారుమారు కూడా చేశారని ఆరోపించారు.

వేణుగోపాల్ వాదనలను అభిషేక్ మను సింఘ్వీ వ్యతిరేకించారు. కోల్ కతా కమిషనర్ ను వేధించేందుకు సీబీఐ ప్రయత్నించిందని ఆరోపించారు. శారదా స్కామ్ దర్యాప్తులో సిట్ పాత్రను సుప్రీంకోర్టు అప్పట్లో ప్రశంసించిందని, ఈ కేసు వ్యవహారాలు ఇతర రాష్ర్టాల్లో ఉన్నందునే…  దర్యాప్తును సీబీఐకి అప్పగించిందని సింఘ్వీ గుర్తు చేశారు. రాజీవ్ పై ఇంతవరకు ఒక్క FIR కూడా నమోదు కాలేదని, చిట్ ఫండ్ కేసుల్లో ఆయన నిందితుడు కూడా కాదని తెలిపారు. కేసును ఐదేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ… సాక్ష్యాధారాలు ధ్వంసం అయ్యాయని ఇప్పుడెలా చెప్తున్నారని సింఘ్వీ నిలదీశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు మమతా బెనర్జీ. ఇది తమ నైతిక విజయమన్నారు. తమ యుద్ధం సీబీఐపై కాదని, కేవలం కేంద్రంపైనే అని చెప్పారు. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పు తమ విజయమన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. పేదల డబ్బును దోచుకున్నవారిపై విచారణ జరగాల్సిందేనన్నారు.  చిట్ ఫండ్ స్కాం విచారణలో.. మమతా బెనర్జీ ఇన్వాల్స్ అయ్యి ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు.

పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంట్లోకి సీబీఐ అధికారులు ప్రవేశించడాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కలకత్తా హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు… సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన రాజీవ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది కేంద్రం. రాజీవ్ కుమార్ సహా మరికొందరు అధికారులు మమతా బెనర్జీతో పాటు ధర్నాలో కూర్చున్నారు. అలా చేయడం సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని… రాజీవ్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు… ఆ చర్యలేమిటో తమకు తెలపాలని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లెటర్ రాసింది. దీంతో మోడీ, దీదీల మధ్య యుద్ధ మరింత ముదిరేలా కనిపిస్తోంది.