రాఫేల్ కేసులో రివ్యూ పిటిషన్లు విచారిస్తాం: సుప్రీం కోర్టు

రాఫేల్ కేసులో రివ్యూ పిటిషన్లు విచారిస్తాం: సుప్రీం కోర్టు

రాఫేల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో రివ్యూ పిటిషన్లను విచారించవద్దని కేంద్రం.. సుప్రీంను అభ్యర్థించింది. అయితే కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ… రివ్యూ పిటిషన్లనై విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ క్రిషన్ కౌల్, జస్టిస్ KM జోసెఫ్ ధర్మాసనం.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని… దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని పిటిషన్లను కొట్టివేస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పుపై ఈ ఏడాది జనవరి 2న రివ్యూ పిటిషన్ వేశారు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్.

రివ్యూ పిటిషన్లు విచారణలో ఉండగానే… రాఫెల్ డీల్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి. వాటిని ఓ జాతీయ దినపత్రిక పబ్లిష్ చేసింది. మరోవైపు కొన్ని డాక్యుమెంట్ల చోరీ అయ్యాయని కోర్టుకు తెలిపింది కేంద్రం. మార్చి 14న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కోర్టును తప్పుదోవ పట్టించునేందుకు అనధీకృత పద్దతిలో కొన్ని డాక్యుమెంట్లను చోరీ చేసి… వాటిని సెలెక్టివ్ మ్యానర్ లో పబ్లిష్ చేశారంది కేంద్ర ప్రభుత్వం. అది దేశ భద్రతకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసిన డాక్యుమెంట్లన్నీ దొంగిలించినవేనని సుప్రీంకోర్టుకు తెలిపారు అటార్నీ జనరల్ K K వేణుగోపాల్. రాఫెల్ డీల్ కు చెందిన డాక్యుమెంట్లన్నీ సమాచార హక్కు చట్టం కిందకు రావన్నారు. అందుకే రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంను కోరారు అటార్నీ జనరల్.