
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మరో చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆర్మ్డ్ఫోర్సెస్లో ‘జెండర్ బయాస్’కు ముగింపు పలికేలా కీలక కామెంట్స్ చేసింది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా కమాండింగ్ పొజిషన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్‌ను మూడు నెలల్లోగా మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన బెంచ్.. సోమవారం తీర్పు వెల్లడించింది. కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
పదేళ్లు ఆశ్రద్ధ చూపారు
ఉమెన్ ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేకున్నా.. దాన్ని అమలు చేయండంలో కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదని 2011 సెప్టెంబర్ 2న సుప్రీం క్లారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్మీలోకి మహిళలను తీసుకోవడమనేది ఓ ఎవల్యూషనరీ ప్రాసెస్ అని, ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత మహిళకు శాశ్వత కమిషన్‌ను ఇచ్చి ఉండాల్సిందని కామెంట్ చేసింది. ‘‘మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌ను ఇవ్వకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించింది. ఇండిపెండెన్స్ వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విషయంలో కేంద్రం తన ఆలోచనలను మార్చుకోవాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. మహిళలకు సమాన అవకాశాలను నిరాకరించేందుకు కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటూ ఏదీ లేదని కామెంట్ చేసింది.
సర్వీసుతో సంబంధం లేకుండా..
సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులు ఎన్ని ఏళ్లుగా సర్వీసులో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా వారికి శాశ్వత కమిషన్‌ను వర్తింపజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలుచేయాలని సూచించింది. అంతకుముందు, సర్వీస్ నిబంధనలను పూర్తి చేసిన మహిళాధికారులకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సైన్యంలో మహిళలను చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతోందని, వారికి సరిపడే, వారు నిర్వర్తించగలిగే అన్ని రకాల బాధ్యతలనూ వారికి అప్పగిస్తామని ఆర్మీ తెలిపింది. దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది మహిళలకు, సైన్యానికి కూడా ప్రయోజనం కలిగించేలా ఉంటుందని స్పష్టం చేసింది.
తానియా, సోఫియా గురించి ప్రస్తావించిన బెంచ్
మహిళలు గతంలో దేశానికి ఎంతో కీర్తి తీసుకొచ్చారని బెంచ్ చెప్పింది. ఎన్నో గ్యాలెంటరీ మెడల్స్, సేనా మెడల్స్, యూఎన్ పీస్ కీపింగ్ అవార్డులు గెలుచుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా కెప్టెన్ తానియా షేర్ గిల్, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీల గురించి ప్రస్తావించింది. మొన్నటి రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆల్ మెన్ కంటింజెంట్‌ను తానియా లీడ్ చేశారు. ఆల్ మెన్ కంటింజెంట్స్ను ఓ మహిళా అధికారి లీడ్ చేయడం వరుసగా ఇది రెండోసారి. అంతకుముందు ఆర్మీ డే ఫంక్షన్లో ఆల్ మెన్ కంటింజెంట్‌ను లీడ్ చేసిన తొలి మహిళా పరేడ్ అడ్జుడెంట్గా తానియా రికార్డు సృష్టించారు. మల్టీ నేషనల్ మిలటరీ ఎక్సర్సైజ్లో మన ఆర్మీ కంటింజెంట్‌ను లీడ్ చేసిన తొలి మహిళా ఆఫీసర్‌గా కల్నల్ ఖురేషీ రికార్డులకెక్కారు.
మహిళలంటే బీజేపీకి గౌరవం లేదు: రాహుల్
ఉమెన్ ఆఫీసర్లు కమాండింగ్ పోస్టులకు, పర్మినెంట్ సర్వీస్‌కు అర్హులు కాదని సుప్రీంకోర్టులో వాదించి.. కేంద్రం మహిళలను అగౌరవపరిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ హక్కుల కోసం నిలబడి.. ప్రభుత్వం తప్పు చేస్తోందని నిరూపించారంటూ మహిళా అధికారులను మెచ్చుకున్నారు.
త్వరలో థియేటర్ కమాండ్స్: సీడీఎస్
భవిష్యత్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని వెస్టర్న్, నార్తర్న్ బోర్డర్లలో రెండు నుంచి ఐదు థియేటర్ కమాండ్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. తొలి థియేటర్ కమాండ్ 2022లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. యుద్ధ సమయంలో అన్ని రక్షణ దళాలు ఒకే లక్ష్యంతో పనిచేసేందుకు థియేటర్ కమాండ్లు ఉపయోగపడుతాయని ఆయన చెప్పారు.