అత్యాచార బాధితురాలికి రూ. 50 లక్షల నష్ట పరిహారం.

అత్యాచార బాధితురాలికి రూ. 50 లక్షల నష్ట పరిహారం.
  • గుజరాత్ సర్కార్‌కు సుప్రీం సంచలన ఆదేశం
  • బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు
  • బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు

2002 లో గుజరాత్ గోద్రా అల్లర్ల సమయంలో 22 సార్లు సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి  విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆమెకు రూ.50 లక్షల పరిహారంతో పాటు, ప్రభుత్వం ఉద్యోగం, నివాసముండేందుకు ఓ ఇంటిని కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

2002, మార్చి 3న గుజరాత్ లోని దహోద్ లో ఉన్న రంథిక్ పూర్ గ్రామంపై కొందరు హిందుత్వ మూకలు దాడిచేశాయి. గోద్రా రైలు దహనం అనంతరం పగతో రగిలిపోయిన ఈ అల్లరిమూకలు దహోద్  సమీపంలోని రంథిక్ పూర్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబంపై దాడిచేశాయి. కుటుంబ యజమాని బిల్కిస్‌ యాకూబ్‌ రసూల్‌, అతడి భార్య బానో మినహా మిగిలిన 13 మందిని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు..ఈ నేపథ్యంలో బానో  పోలీసులను ఆశ్రయించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

చివరకు 2004లో ఈ అఘాయిత్యంపై కేసు నమోదయింది. 2017, మే 4న ముంబై హైకోర్టు దోషులను తప్పించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లను దోషులుగా తేల్చింది. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడ్డ 11 మందికి ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అంతకుముందు గుజరాత్ ప్రభుత్వం బానోకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా ఆమె దాన్ని తిరస్కరించారు.