
- ఆఫ్‌షోర్ ఇన్వెస్ట్‌మెంట్లపై సెబీ దర్యాప్తులో ఏం తేలలేదు
- అవకతవకలు జరిగాయనే అనుమానాలున్నా...అదానీ కంపెనీలు రూల్స్‌ను ఫాలో అయ్యాయి
- సుప్రీం కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి ఊరట లభించింది. ఈ గ్రూప్ షేర్లు పెరగడంలో మానిప్యులేషన్ జరిగిందని చెప్పలేమని తేల్చి చెప్పింది. ఆఫ్‌షోర్ కంపెనీల నుంచి అదానీ గ్రూప్‌లోకి వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని సెబీ నిరూపించలేకపోవడంతో సుప్రీం కోర్టు కమిటీ పై విధంగా పేర్కొంది. కానీ, హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడే ముందు ఈ గ్రూప్ షేర్లలో భారీగా షార్ట్ పొజిషన్లు ఓపెన్ అయినట్టు ఆధారాలు ఉన్నాయని ఆరుగురి మెంబర్లతో కూడిన ఎక్స్‌పర్ట్ కమిటీ వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడ్డాక అదానీ గ్రూప్ షేర్లు 80 శాతం మేర క్రాష్ అయిన విషయం తెలిసిందే. షేర్లు పడ్డాక ఈ షార్ట్ పొజిషన్లను తీసుకున్నవారు భారీగా లాభపడ్డారని కమిటీ వివరించింది. ‘ఆధారాలు పరిశీలించాక, సెబీ వివరణను పరిగణనలోకి తీసుకున్నాక అదానీ గ్రూప్ షేర్లు పెరగడంలో రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ జరిగాయని ప్రస్తుత స్టేజ్‌లో చెప్పలేం’ అని సుప్రీం కోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్ట్‌లో ఎక్స్‌పర్ట్ ప్యానెల్ పేర్కొంది. కంపెనీల్లో మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ రూల్స్ లేదా థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్లకు సంబంధించి సెబీ ఫెయిలవ్వలేదని వివరించింది. షేర్ మానిప్యూలేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్‌కు అదానీ గ్రూప్ పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఈ ఏడాది జనవరి 24న రిపోర్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బకు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఈ ఇష్యూపై దర్యాప్తు జరిపేందుకు ఆరు మెంబర్లతో కూడిన ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. సెబీకి సమాంతరంగా ఈ కమిటీ కూడా తన దర్యాప్తు జరిపింది. ఈ ఎక్స్‌పర్ట్ కమిటీలో సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ ఏఎం సాప్రేతో సహా ఓపీ భట్, కేవీ కామత్, నందన్ నిలేకని, సోమ్‌శేఖర్ సుదర్శన్, జస్టీస్ జేపీ దేవందర్ ఉన్నారు.
ఆ 13 సంస్థల ఓనర్‌షిప్‌పై అనుమానాలు..
అదానీ గ్రూప్ షేర్లలో ఓనర్‌షిప్ ఉన్న 13 ఓవర్‌సీస్ సంస్థల హోల్డింగ్స్‌పై పారదర్శకత లేకపోవడంతో అదానీ గ్రూప్‌పై సెబీకి అనుమానాలు పెరిగాయని, ఇది దర్యాప్తుకు దారి తీసిందని ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ 13 ఓవర్‌సీస్ సంస్థలు మేనేజ్ చేస్తున్న అసెట్స్‌కు సంబంధించిన 42 మందిని సెబీ గుర్తించింది. ‘ఈ కంపెనీలు నిజంగానే పబ్లిక్ షేర్ హోల్డర్లు కాదని, కంపెనీ ప్రమోటర్లకు చెందినవనే అనుమానాలు సెబీకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, సెబీ అన్ని యాంగిల్స్‌లో దర్యాప్తు చేసినా ఈ 13 కంపెనీల అసలు ఓనర్లు ఎవరో నిర్ధారించలేకపోయాయి’ అని రిపోర్ట్ వెల్లడించింది. కాగా, ఈ 13 ఓవర్‌సీస్ కంపెనీలు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌పీఐ) పై నిర్ణయాలు తీసుకున్న వారిని బెనిఫిషియల్ ఓనర్లుగా డిక్లేర్ చేశాయి. 2018 లో తెచ్చిన చట్టం ప్రకారం, ఈ ఎఫ్‌పీఐలతో ఆర్థికంగా లింక్‌లున్న వారి గురించి బయటపెట్టాల్సిన అవసరం లేదు. కాగా, ఈ 13 ఓవర్‌సీస్ సంస్థల ఓనర్‌షిప్‌పై 2020 నుంచి సెబీ దర్యాప్తు చేస్తోంది. సెబీకి వచ్చిన అనుమానాలు క్లియర్ కాలేకపోయాయని కమిటీ రిపోర్ట్‌లో వెల్లడించింది. అవకతవకలు జరిగాయని సెబీ అనుమానించిందని, అదే టైమ్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ రూల్స్‌ను ఫాలో అయ్యాయని, అందువలన సెబీ రిపోర్ట్ చికెన్ –ఎగ్ పరిస్థితిలా కనిపిస్తోందని ఎక్స్‌పర్ట్ కమిటీ వ్యాఖ్యానించింది ‘ఈ ఏడాది జనవరి 24 తర్వాత అదానీ కంపెనీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగాయి. దీనిని బట్టి ఈ టైమ్ పీరియడ్‌లో స్టాక్ మార్కెట్ మొత్తం తీవ్ర ఒడిదుడుకులకు గురికాలేదని చెప్పొచ్చు. అదానీ గ్రూప్ షేర్లలో వోలటాలిటీ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇందుకు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణం’ అని వెల్లడించింది.
అదానీ షేర్లు జూమ్..
ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి ఊరట లభించడంతో అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం లాభాల్లో కదిలాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 4 శాతం పెరగగా, అదానీ పోర్ట్స్ షేర్లు 4 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 4 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 3 శాతం, అదానీ విల్‌మార్ 7 శాతం చొప్పున పెరిగాయి. ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి.