రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం

రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సాగిస్తున్న ఆందోళన జనజీవనానికి ఇబ్బందిగా మారిందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కేందం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న చర్చలు ఫలించేలా కన్పించట్లేదన్న కోర్టు…సమస్యను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. రైతుల ఆందోళనల విరమింప చేయాలని కోరుతూ రిషభ్‌ శర్మ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా…మద్దతుగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం..ఈ చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారని.. దీనిపై కేంద్రం సానుకూల దృక్పథంతో చర్చలు జరపనంత వరకు అవి విఫలమవుతూనే ఉంటాయని తెలిపింది.

ఈ చర్చలు ఫలించేలా కన్పించడం లేదని, త్వరలోనే ఇది జాతీయ సమస్యగా మారే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదని ప్రభుత్వ తరుఫున సొలిసీటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్‌ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేస్తూ..విచారణను గురువారానికి వాయిదా వేసింది. రైతుల ఆందోళనలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఒకే సారి విచారణ చేపడతామని చెప్పింది సుప్రీం.