- చొరబాటుదారులకు ఆధార్ కార్డు ఉంటే ఓటు హక్కు ఇవ్వాలా?: సుప్రీం
- ఓటర్ నమోదుకు ఇచ్చిన పత్రాలను చెక్ చేసే అధికారం ఈసీకి ఉంది
- ఈసీది పోస్టాఫీస్ పాత్ర కాదని వ్యాఖ్య
- సర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ బెంచ్ విచారణ
న్యూఢిల్లీ: సిటిజన్‌షిప్ పొందేందుకు ఆధార్ కార్డు ప్రూఫ్ కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ‘‘మన దేశంలో ఎంతోమంది చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందుతున్నారు. అలా అని మన దేశ పౌరులు కాకున్నా వాళ్లకు ఓటు హక్కు కల్పించాలా?” అని ప్రశ్నించింది. తమిళనాడు, కేరళ, బెంగాల్‌లో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపడ్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఆధార్, ఓటర్ కార్డులపై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దేశంలోని ప్రతి ఒక్కరికీ సామాజిక సంక్షేమ పథకాలు చేరేందుకు ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. సిటిజన్‌షిప్ పొందేందుకు, శాశ్వత నివాస స్థలాన్ని ధ్రువీకరించేందుకు ఆధార్ ప్రూఫ్ కాదని ఆధార్ చట్టంలోనే స్పష్టంగా ఉంది. కాబట్టి ఆధార్ ఉన్నంత మాత్రానా ఆటోమేటిక్‌గా ఓటు హక్కు రాదు” అని స్పష్టం చేసింది.
మన పక్క దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇక్కడ కూలీగా పని చేస్తూ రేషన్ కోసం ఆధార్ కార్డు పొందితే, అతనికి కూడా ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించింది. ఎవరి పేరునైనా ఓటర్ జాబితా నుంచి ఈసీ తొలగిస్తే, వాళ్లకు తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ‘‘తమను ఓటర్‌గా నమోదు చేయాలని ఎవరైనా ఈసీకి ఫామ్ 6 కింద అప్లికేషన్ పెట్టుకుంటే.. ఆ దరఖాస్తుతో జత చేసిన డాక్యుమెంట్లు సరైనవేనా? కాదా? అని నిర్ధారించుకునే అధికారం ఈసీకి ఉంది.
ఈసీది కేవలం పోస్టాఫీస్ పాత్ర కాదు” అని వ్యాఖ్యానించింది. కాగా, సర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ ఒకటిలోగా కౌంటర్లు ఫైల్ చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పిటిషనర్లు రీజాయిండర్స్ దాఖలు చేస్తారని, త్వరలోనే ఈ అంశంపై మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది.
