- పాలనా లోపం వల్లే దాడి జరిగిందంటూ పిటిషన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘అడ్మినిస్ట్రేషన్, భద్రతా వైఫల్యాల కారణంగానే పుల్వామా, ఉరీ దాడులు జరిగాయి. వీటిపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ చేయించండి. ఆ దాడులకు కారణమైన వారిని శిక్షించండి’’ అంటూ అడ్వకేట్ వినీత్ దండ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, అందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
2016 సెప్టెంబరు 18న జమ్ము, కశ్మీర్ లోని ఉరీ సైనిక స్థావరంపై పాక్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడి చేసి 20 మంది వీర జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. అలాగే ఈ నెల 14న కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ రెండు దాడులూ పరిపాలనా లోపం, నిఘా వైఫల్యం వల్ల జరిగాయని అడ్వకేట్ వినీత్ తన పిటిషన్లో చెప్పారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
