ఫోన్ ట్యాపింగ్ కేసులో.. హరీశ్ రావు విచారణకు సుప్రీం నో

ఫోన్ ట్యాపింగ్ కేసులో.. హరీశ్ రావు విచారణకు సుప్రీం నో
  • హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం: ధర్మాసనం
  • న్యాయపరమైన క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తం
  •  ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, పోలీస్ ఉన్నతాధికారి రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. న్యాయపరమైన క్రమశిక్షణ, నిలకడకే తమ ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పింది. 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ ను హరీశ్ రావు ఆదేశాల మేరకు రాధాకిషన్ రావు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీనిపై 2024, డిసెంబర్ 1న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత హరీశ్ రావు పీఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తనపై అక్రమంగా కేసు పెట్టారని, నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ హరీశ్ 2024, డిసెంబర్ 4న హైకోర్టును ఆశ్రయించారు. 

సుదీర్ఘ వాదనల తర్వాత  2025, మార్చి 20న ఎఫ్ఐఆర్​ను క్వాష్ చేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే, హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం 2025, జూన్ 18న సుప్రీంకోర్టులో హరీశ్ రావు, రాధా కిషన్ రావుపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసింది. 

ఈ పిటిషన్లను సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్​ విచారించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ్ లూథ్రా, హరీశ్ తరఫున అడ్వకేట్ శేషాద్రి నాయుడు, ఏవోఆర్ మోహిత్ రావు వాదనలు వినిపించారు.

హరీశ్ విచారణతో నిజాలు వెలుగులోకి: అడ్వకేట్ సిద్దార్థ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్​ను విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని అడ్వకేట్ సిద్దార్థ్ లూథ్రా కోర్టు కు నివేదించారు. ‘‘బీఆర్ఎస్ లో చేరకపోతే ఫినిష్ చేస్తామని నిందితులు పిటిషనర్ చక్రధర్ గౌడ్ ను హెచ్చరించారు. ఈ క్రమంలో 2024, మార్చి 15న ఢిల్లీలో చక్రధర్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇదే టైంలో ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్’ తన ఐఫోన్‌‌ను టార్గెట్ చేశారు. రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్ లోని సమాచారం దొంగలించే ప్రయత్నం చేస్తున్నారని యాపిల్ సంస్థ నుంచి చక్రధర్ కు మెయిల్ ద్వారా హెచ్చరికలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ లో ఎంతోమంది ప్రమేయం ఉంది’’అని కోర్టుకు సిద్దార్థ్ లూథ్రా తెలిపారు.

ఇరువైపులా వాదనలు విన్న బెంచ్

ప్రభుత్వ వాదనలపై హరీశ్ తరఫు అడ్వకేట్లు అభ్యంతరం తెలిపారు. సుదీర్ఘ విచారణ తర్వాతే హైకోర్టు తీర్పు ఇచ్చిందని కోర్టుకు విన్నవించారు. ఇదే అంశంపై చక్రధర్ గౌడ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఇరు వైపు వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. న్యాయపరమైన క్రమశిక్షణ, స్థిరత్వం దృష్ట్యా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు వెల్లడించారు.