Supreme Court on VI: సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో వొడఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది. కోర్టు తీర్పుతో విఐ ప్రభుత్వానికి టెలికాం దిగ్గజం బకాయి ఉన్న ఏజీఆర్ చెల్లింపులపై మళ్లీ పునఃపరిశీలనకు అనుమతి లభించింది. కంపెనీకి అలాగే ఇన్వెస్టర్లకు, టెలికాం పరిశ్రమకు కొత్త ఊరటగా ఈ తీర్పు నిలిచిందని నిపుణులు అంటున్నారు.
2025 అక్టోబరు 27న సుప్రీం కోర్టు ముఖ్య న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని బెంచ్, కేంద్ర ప్రభుత్వానికి వోడఫోన్ ఐడియాపై ఉన్న అదనపు AGR బకాయిల అంశాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలో 49% వాటా కలిగి ఉండటంతో.. టెలికాం సేవలు వినియోగిస్తున్న 20 కోట్లకు పైగా ఖాతాదారుల ప్రయోజనాలకు దృష్ట్యా ప్రజాహితంపై ప్రభావం చూపే అంశమని కోర్టు అభిప్రాయపడింది.
తనపై విధించిన అదనపు రూ.9వేల450 కోట్ల AGR బకాయిలను ప్రభుత్వం మళ్లీ పరిగణించాలంటూ వోడఫోన్ ఐడియా సంస్థ కోర్టును ఆశ్రయించటంతో తాజా పరిణామం చోటుచేసుకుంది. 2020లో అమలు చేసిన "డెడక్షన్ వెరిఫికేషన్ గైడ్లైన్స్" కారణంగా ఏర్పడిన లెక్కింపు తేడాలతో చెల్లించాల్సిన మెుత్తం బకాయి అప్పులు భారీగా పెరిగాయని కంపెనీ వాధిస్తోంది. తాజా కోర్టు తీర్పుతో కంపెనీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీ, జరిమానా రద్దుతో పాటు మెుత్తం బకాయిలను తగ్గించటానికి అవకాశం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే టెలికాం దిగ్గజంపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా.. రుణ భారం విముక్తితో పాటుగా నెట్‌వర్క్ అప్‌గ్రేడ్స్, 5Gలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం చేస్తుంది. కోర్టు తీర్పు తర్వాత ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో స్టాక్ ధర లాభపడింది. మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో షేర్ రేటు 2.49 శాతం పెరిగి రూ.9.86 వద్ద కొనసాగుతోంది ఎన్ఎస్ఈలో.
ఇన్వెస్టర్లు, కంపెనీపై ప్రభావం..
తాజా కోర్టు తీర్పుతో Vodafone Ideaకి తాత్కాలికంగా ఊరట లభించింది. కంపెనీకి ప్రత్యక్షంగా రుణ భారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద అవకాశం లభించింది. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. దీని వల్ల టెలికాం రంగంలో మిగిలిన కంపెనీలకూ సానుకూల సంకేతాలు వెళ్లే వీలుంది. చివరిగా ప్రధాన టెలికాం సంస్థలకు రెండు దశాబ్దాల్లో ఎదురైన అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అవకాశం కల్పించే చారిత్రాత్మక నిర్ణయంగా కోర్టు తీర్పు నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
