రాత్రికి రాత్రే డీలిమిటేషన్‌ చేపట్టలేం

 రాత్రికి రాత్రే డీలిమిటేషన్‌ చేపట్టలేం
  • 2026 దాకా ఆగాల్సిందేనని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
  • జమ్మూ-కాశ్మీర్ మాదిరిగానే సీట్లు పెంచాలని పిటిషనర్‌‌ అప్పీల్‌
  • తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ, వెలుగు: డీలిమిటేషన్ అనేది పెద్ద కసరత్తు అని, తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుకోసం దానిని రాత్రికి రాత్రే చేపట్టలేమని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 జనాభా లెక్కల వరకు డీలిమిటేషన్‌ కోసంవేచి చూడాల్సి ఉంటుందని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌‌ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి డీలిమిటేషన్ సాధ్యమైందని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌(ఏఎస్‌జీ) కేఎం నటరాజన్‌ కోర్టుకు వివరించారు. 

ఏపీ విభజన చట్టం - 2014 లోని సెక్షన్ 26 ప్రకారం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి 2022 జూన్‌లో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ, తెలంగాణను మినహాయించి కొత్తగా ఏర్పడ్డ జమ్మూ- కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత్రాల(యూటీల) అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు డీలిమిటేషన్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అదే ఏడాదిలోనే విచారించిన సుప్రీం కోర్టు.. కేంద్రం, ఏపీ, తెలంగాణ, కేంద్ర ఎన్నికల సంఘాల నుంచి రెస్పాన్స్ కోరింది. బుధవారం మరోసారి ఈ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన బెంచ్‌ ముందుకు వచ్చింది.

 డీలిమిటేషన్‌కోసం 2026 దాకా వేచి చూడాలన్న ఏఎస్‌జీ వాదనలపై పిటిషనర్‌‌ పురుషోత్తం రెడ్డి తరఫు లాయర్‌‌ అభ్యంతరం తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర హోదా మారిందని గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్‌‌తో పాటు తెలంగాణ, ఏపీలో డీలిమిటేషన్‌పై సమానత్వం కల్పించాలన్నారు. డీలిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్రం తన అధికారాలను వినియోగించుకుంటే, అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా డీలిమిటేషన్‌ను వర్తింపజేయొచ్చన్నారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ భవిష్యత్ లో అదే హోదాలో ఉండాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు ముగించారు.

జనాభా లెక్కల తర్వాతే సీట్ల పెంపు..

ఆర్టికల్ 82 ప్రకారం, ప్రతి జనాభా లెక్కల తర్వాత అంటే 2026 తర్వాత మాత్రమే సీట్ల పెంపునకు వీలు కలుగుతుందని ఏఎస్‌జీ నటరాజన్ వాదించారు. రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలున్నాయన్నారు. ఆర్టికల్స్ 82, 170 లోని నిబంధనల దృష్ట్యా ఈ ప్రక్రియను అమలు చేయాల్సిన అవసరం లేదంటూ వాదనలు ముగించారు. అన్నివైపుల నుంచి వచ్చిన వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.