త్వరగా విచారణ సాధ్యం కాదు.. అమరావతి రాజధాని కేసు విచారణ డిసెంబర్‌కు వాయిదా

త్వరగా విచారణ సాధ్యం కాదు.. అమరావతి రాజధాని కేసు విచారణ డిసెంబర్‌కు వాయిదా

అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈమేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సి ఉందని, నవంబర్ వరకూ ఈ కేసుల విచారణ జరుగుతుందని చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం కేసులున్న నేపథ్యంలో.. ఈ కేసుకు త్వరగా సమయం కేటాయించలేమని పేర్కొంది. ఈలోపు ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం (జులై 11) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యర్థనను మన్నించలేమని పేర్కొంది.

 ఏపీ రాజధాని  కేసుకు సంబంధించి కేంద్రం తన వైఖరి చెప్పాలంటూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసంది. దీనిపై స్పందించిన కేంద్రం..అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆశించిన విధంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి అటు రైతులు, ఇటు ప్రభుత్వం అలాగే అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించారు. ఇప్పుడు డిసెంబర్ వరకు ఏపీ రాజధాని కేసు వాయిదా వేయడంతో ...  తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.