డాక్టర్లు పల్లెల్లో పనిచేయాల్సిందే: సుప్రీం కోర్టు

డాక్టర్లు పల్లెల్లో పనిచేయాల్సిందే: సుప్రీం కోర్టు

    బాండ్​ రాసివ్వడం  అక్రమమో, అన్యాయమో కాదు

    ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కాకుండా దేశమంతా ఒకే విధానం తెండి

    వైద్యమూ పల్లెల్లోని పేద జనాల ప్రాథమిక హక్కే

    రూరల్​ ఆస్పత్రుల్లో డాక్టర్ల కంపల్సరీ డ్యూటీకి మద్దతు

న్యూ ఢిల్లీ: పల్లె ఆస్పత్రుల్లో డాక్టర్లు తప్పనిసరిగా పనిచేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ‘తప్పనిసరి బాండ్​ విధానాన్ని’ సమర్థించింది. అయితే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిబంధనలున్నాయని, అలా కాకుండా దీనిపై దేశమంతా ఒకే విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, భారత వైద్య మండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేస్తామని హామీ ఇస్తూ పీజీ, స్పెషాలిటీ కోర్సుల అడ్మిషన్ల టైంలో స్టూడెంట్లు ముందే బాండ్​ పేపర్​ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. రాష్ట్రాన్ని బట్టి 2 నుంచి ఐదేళ్ల పాటు పల్లె దవాఖానాల్లో పనిచేస్తామంటూ స్టూడెంట్లు బాండ్​ ఇవ్వాల్సి ఉంటుంది. బాండ్​ విలువ కూడా రాష్ట్రాన్ని బట్టి ₹50 లక్షల వరకు ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ విధానంపై కొందరు స్టూడెంట్లు సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఆ పిటిషన్​ను మంగళవారం జస్టిస్​ ఎల్​ నాగేశ్వరరావు, జస్టిస్​ హేమంత్​ గుప్తాల ధర్మాసనం విచారించింది. ‘‘బాండ్​ విధానం అక్రమం, అన్యాయం కాదు. గ్రామీణ ప్రాంతాలకూ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నదే దాని ఉద్దేశం. అయితే, ఆ విధానాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉన్నాయి. అలా కాకుండా దేశమంతా ఒకే విధానం ఉండాలి. కాబట్టి ప్రభుత్వ కాలేజీల్లో చదివిన స్పెషలిస్టు డాక్టర్లు పల్లెల్లో పనిచేసేలా కేంద్రం, ఎంసీఐ ఆ విధానాన్ని తయారు చేయాలి” అని ఆదేశించింది.

రెండేళ్లకు బాండ్​ తీసుకోవాలని, ఒకవేళ ఆ బాండ్​ ప్రకారం పనిచేయకపోతే ₹20 లక్షల ఫైన్​ వేయాలని కేంద్రానికి సూచించింది. ఈ నిర్ణయం కేవలం బడుగు, బలహీన వర్గాల ప్రాథమిక హక్కులను కాపాడేందుకేనని, వాళ్లకూ కనీస హెల్త్​ సర్వీసులను అందించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని జడ్జిలు పేర్కొన్నారు. ‘‘ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దవాఖానాలు, హెల్త్​ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అదే టైంలో అవి జనానికి దగ్గరగా, అందుబాటులో ఉండాలి. డాక్టర్లూ అక్కడ పనిచేయాలి” అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, గోవా, గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్​, తమిళనాడు, పశ్చిమబెంగాల్​లో ఈ విధానం అమలవుతోంది.