ఇస్రో గూఢచర్యం కేసు:  నలుగురు నిందితులకు బెయిల్ తీర్పు కొట్టివేత

ఇస్రో గూఢచర్యం కేసు:  నలుగురు నిందితులకు బెయిల్ తీర్పు కొట్టివేత

ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. గూఢచర్యం వ్యవహారంలో శాస్త్రవేత్త నంబి నారాయణ్ ను ఇరికించారన్న కేసులో మాజీ DGP సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును తిరిగి హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని.. నిందితుల బెయిల్ దరఖాస్తు మళ్లీ మొదటి నుంచి విచారించాలని దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్ దరఖాస్తుపై కోర్టు తీర్పు వచ్చే వరకు నిందితులను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని సూచించింది. 

1994లో క్రయోజనిక్  ఇంజిన్  తయారీకి సంబంధించిన కీలక పత్రాలను శాస్త్రవేత్త నంబి నారాయణ్ .. విదేశీయులకు అప్పగించారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రయోజనిక్  ఇంజిన్  పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్ పై ఈ ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితులకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్  ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును సీబీఐ  ఆశ్రయించింది. నంబి నారాయణ్ పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్  ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, రోదసీ కార్యక్రమాలు ఒకటి, రెండు దశాబ్దాల పాటు వెనకబడ్డాయని సీబీఐ వాదించింది. నిందితులకు బెయిల్  ఇస్తే.. విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్  ఎం.ఆర్ . షా, జస్టిస్  సి.టి. రవి కుమార్  ధర్మాసనం పైవిధంగా తీర్పు చెప్పింది.