
హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఐదేండ్ల సర్వీస్ ఉన్న టీచర్లు రెండేండ్లలో టెట్ ఉత్తీర్ణులు కాకపోతే, ఉద్యోగం వదులు కోవాలని తీర్పు ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఈ తీర్పుతో సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుందని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
2010 ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం టెట్ ఉత్తీర్ణత అనేది నియామకాలకు తప్పనిసరి అయిందని, అప్పటికే రిక్రూట్మెంట్ అయిన వారికి మినహాయింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. అయినా, ప్రమోషన్లకు టెట్ అవసరమా అనే వివాదంపై తమిళనాడు, మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తాజా తీర్పును ఇచ్చిందని పేర్కొన్నారు. 20, 25 ఏండ్ల పాటు విధుల్లో ఉన్న టీచర్లు రెండేండ్లలో టెట్ రాయాలనడం అసాధ్యమని, దీంతో టీచర్లలలో తీవ్ర ఆందోళన నెలకొన్నదని వెల్లడించారు. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.