ఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ధర్మాసనం స్టే విధించింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేనందున తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ ఇచ్చిన జీవో 176పై కూడా స్టే విధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ బీర్రు ప్రతాప్ రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పిటిషన్లలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఆ రాష్ట్ర పంచాయితీ ఎన్నికల్లో 59.85 శాతాం రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పుపట్టింది. దీనిపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 17న వివిధ రాజకీయ పార్టీలతో విజయవాడలోని ఈసీ ఆఫీసులో సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి హాజరవ్వాలని ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు మంగళవారం తెలిపారు.

Supreme court stay on Andhra Pradesh local body elections