మోడల్‌ హెయిర్‌ కట్ వివాదం

మోడల్‌ హెయిర్‌ కట్ వివాదం

న్యూఢిల్లీ: హెయిర్‌ కట్ మంచిగా చేయనందుకుగానూ మోడల్‌కు  రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఢిల్లీకి చెందిన ఆష్నా రాయ్ అనే మోడల్ ఐటీసీ సంస్థకు చెందిన సెలూన్​లో హెయిర్‌ కట్ చేయించుకున్నారు. హెయిర్ డ్రెస్సర్ తన జుట్టును మంచిగా కట్ చేయలేదని ఆమె ఆవేదనకు గురయ్యారు.

దాంతో  ఆష్నా రాయ్, హెయిర్‌ కట్ వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని ఆరోపిస్తూ ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు. ఐటీసీ సంస్థ తనకు రూ.2 కోట్లు నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో  పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును విచారించిన ఎన్‌సీడీఆర్‌సీ.. ఆష్నా రాయ్​కి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని ఐటీసీ సంస్థను ఆదేశించింది. దాంతో ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశాలను సవాలు చేస్తూ ఐటీసీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్​ను బుధవారం విచారించింది. కేవలం నోటి మాటతో కాకుండా భౌతిక సాక్ష్యాల ఆధారంగా బాధితురాలికి పరిహారం చెల్లించాలని కోర్టు సూచించింది. పరిహారం చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది.