ప్రాణంకన్నా యాత్రే ఎక్కువా?

ప్రాణంకన్నా యాత్రే ఎక్కువా?
  • కన్వర్‌‌‌‌‌‌‌‌ యాత్రపై మళ్లోసారి ఆలోచించండి
  • ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
  • విచారణ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్‌‌‌‌‌‌‌‌ ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో కన్వర్‌‌‌‌‌‌‌‌ యాత్రపై మరోసారి ఆలోచించాలని ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువకాదని స్పష్టంచేసింది. దేశ ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కు అన్నింటికన్నా ప్రధానమైనవని.. విశ్వాసాలు, మతపరమైన అంశాలన్నీ ఈ ప్రాథమిక హక్కుకు లోబడే ఉంటాయని చెప్పింది. కన్వర్‌‌‌‌‌‌‌‌ యాత్రకు యూపీ సర్కారు అనుమతివ్వడాన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు.. దీనిపై ఇటీవల విచారణ జరిపి కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులిచ్చింది. 

కోర్టు ఆదేశాలతో అఫిడవిట్‌‌‌‌‌‌‌‌
అందరితో కలిసి చర్చించాక కరోనా ఆంక్షలతో పరిమిత సంఖ్యలో జనంతో సింబాలిక్‌‌‌‌‌‌‌‌గా యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్టు అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో యూపీ సర్కారు పేర్కొంది. యాత్రపై అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు యాత్రకు అనుమతి ఇవ్వొద్దని చెప్పింది. వాదనల తర్వాత.. యాత్రపై నిర్ణయాన్ని వచ్చే సోమవారం లోగా కోర్టుకు తెలియజేయాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణను జులై 19కి వాయిదా వేసింది.

జులై 25 నుంచి యాత్ర    
జులై 25 నుంచి మొదలయ్యే కన్వర్‌‌‌‌‌‌‌‌ యాత్రకు యూపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలో యాత్ర జరుగుతుందని స్పష్టంచేసింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా తెచ్చుకోవాలంది.