ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ, కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్ లతో కూడిన బెంచ్ విచారించనుంది.

జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అడ్వకేట్ ఎంఎల్ శర్మ సవాలు చేశారు. కాశ్మీర్ లో  మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని, జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేసుకునేలా సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని అనురాధ భాసిన్ పిటిషన్ వేశారు.  కాశ్మీర్ లో ఆంక్షలపై జోక్యం చేసుకోబోమని మంగళవారం చెప్పిన సుప్రీంకోర్టు..  పరిస్థితి సున్నితంగా ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కొంత సమయం ఇవ్వాలని విచారణను 2 వారాలు వాయిదా వేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు మహ్మద్ అక్బర్ లోన్,  రిటైర్డ్ జస్టిస్ హస్నైన్ మసూది ఈపిటిషన్ దాఖలు చేశారు.