కశ్మీర్ లో హై టెన్షన్: నేడు ఆర్టికల్ 35A పై సుప్రీం లో విచారణ

కశ్మీర్ లో హై టెన్షన్: నేడు ఆర్టికల్ 35A పై సుప్రీం లో విచారణ

Supreme Court to hear challenge to Article 35Aజమ్ముకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35-A పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో లోయలో హై టెన్షన్ నెలకొంది. ఆర్టికల్ 35-A ను తొలగిస్తారన్న ఊహాగానాలతో రాష్ట్రమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 35Aలో సవరణలను వ్యతిరేకిస్తున్న వేర్పాటువాదులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. సుప్రీంలో ప్రతికూల తీర్పు వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 160 మంది వేర్పాటువాద నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కశ్మీర్ లో 10 వేల మంది బలగాలతో భద్రత కల్పిస్తోంది. కేంద్ర హోంశాఖ, గవర్నర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

ఆర్టికల్ 35-ఏ:

కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్సిస్తూ ఆర్టికల్ 35-ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు. ఈ ఆర్టికల్ ద్వారా జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు వచ్చాయి. ఇక్కడి పౌరులను శాశ్వత నివాసులుగా గుర్తిస్తూనే.. బయటి వ్యక్తుల రాకను ఈ ఆర్టికల్ అడ్డుకుంటోంది. ఆర్టికల్ 35-ఏ ప్రకారం ఇతర రాష్ర్టాల పౌరులు కశ్మీర్ లో ఆస్తులు కొనకూడదు, స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు, పరిశ్రమలు, సంస్థలు స్థాపించకూడదు. ఇక ఇక్కడి మహిళ వేరే రాష్ట్ర వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. ఆమెకు ఆస్తిలో ఎటువంటి హక్కు సంక్రమించదు.

అయితే ఈ వివాదాస్పద ఆర్టికల్ ను తొలగించాలంటూ వుయ్ ద సిటిజన్స్ అనే స్వచ్చంధ సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. కాశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టడం వల్ల జమ్మూకాశ్మీర్ కు మిగతా రాష్ట్రాలకు మధ్య రాజకీయ అంతరాన్ని పెంచుతుందని ఆ సంస్థ పిటిషన్ లో తెలిపింది. వుయ్ ది సిటిజన్స్ సంస్థతో పాటు మరికొంత మంది కూడా 35ఏను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఆర్టికల్ 35ఏ పై దాఖలైన పిటిషన్లపై గత ఆగస్టులో సుప్రీంలో విచారణ జరిగింది. అయితే కశ్మీర్ లో స్థానిక ఎన్నికలు జరుగుతుండటంతో విచారణను వాయిదా వేసింది.

రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం లేకపోవడం వల్ల ఈ అంశంపై జరుగుతున్న విచారణను వాయిదా వేయాలంటూ వాద ప్రతివాదులకు ఒక లేఖను ఇవ్వడానికి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ నెల 11న సుప్రీం కోర్టు అనుమతిని కోరారు. ఈ అంశంలో వదంతులను నమ్మి, ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు ప్రభుత్వ తరపు లాయర్ సూచించారు.

మరోవైపు జమ్ము-కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన భారత రాజ్యాంగంలోని 35ఏ అధికరణాన్ని రద్దు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని పాకిస్థాన్ వ్యాఖ్యానించింది. ఆ రాష్ట్రంలో ఇతరుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఆరోపించింది. దీన్ని వ్యతిరేకిస్తామని తెలిపింది.