
- స్పష్టమైన, గట్టి కారణాలుంటే తప్పస్టే ఇవ్వలేం
- వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ
- విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలని కేంద్రం విజ్ఞప్తి
- మిగతా అంశాలపైనా చర్చించాలని పిటిషనర్ల తరఫు లాయర్ల పట్టు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదం తెలిపిన దృష్ట్యా వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమేనని, స్పష్టమైన గట్టి కారణాలు ఉంటే తప్ప అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈమేరకు వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా పార్లమెంట్ ఆమోదించిన చట్టాలకు రాజ్యాంగ బద్ధత ఉన్నట్లే భావించాలని సీజేఐ పేర్కొన్నారు. వక్ఫ్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదించగా.. సీజేఐ స్పందించారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని, అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదన్నారు. కాగా, వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా, 3 అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. వాటిలో వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి.
ఆ 3 అంశాలపైనే విచారణ జరపండి
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గత బెంచ్ లాగానే విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలని కోరారు. కోర్టు 3 అంశాలను గుర్తించిందని తుషార్ మెహతా తెలిపారు. ఆ 3 అంశాలపై కేంద్రం సమాధానం ఇచ్చిందని వెల్లడించారు.
పిటిషనర్ల తరఫు లాయర్ల అభ్యంతరం
కేంద్రం వాదనను పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వ్యతిరేకించారు. ఈ కేసును విచారించి మధ్యంతర ఉపశమనం ఏమి ఇవ్వాలో చూద్దామని అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా చెప్పారని సింఘ్వి గుర్తుచేశారు. అందుకే 3 అంశాలకే తాము పరిమితమవుతామని చెప్పలేమని అన్నారు.