న్యూఢిల్లీ: మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును నడిపి.. ముందు స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టడమే కాకుండా, అక్కడి నుంచి పారిపోయిన ఓ నాయకుడి కొడుక్కి సుప్రీంకోర్టు స్ట్రాంగ్‌వార్నింగ్ ఇచ్చింది. ‘‘నీలాంటోడు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే. నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా అక్కడి నుంచి పారిపోయినందుకు గుణపాఠం నేర్చుకోవాల్సిందే” అని హెచ్చరించింది. 2024 జులైలో ముంబైలోని బాంద్రా వర్లీ ఏరియాలో శివసేన మాజీ నేత రాజేశ్ షా కొడుకు మిహిర్ షా (24) స్థానిక బార్లో పీకలదాకా తాగి, బీఎండబ్ల్యూ కారును స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద బీభత్సం సృష్టించాడు.
అదే మార్గంలో స్కూటీపై వెళ్తున్న ప్రదీప్ నఖ్వా, కావేరీ నఖ్వా (45) దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు గాల్లో ఎగిరిపడ్డారు. రోడ్డుపై పడిన కావేరీపై నుంచి అదే స్పీడ్‌తో కారును మిహిర్ షా తీసుకెళ్లాడు. 1.5 కి.మీ. వరకు ఆమెను ఈడ్చుకెళ్లాడు. దీంతో కావేరీ నుజ్జునుజ్జయి చనిపోయింది. ఆమె భర్త ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిదూరంలో కారును వదిలేసి మిహిర్ షా ఓ ఆటోలో పారిపోయాడు. దేశం విడిచివెళ్లేందుకు యత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు ‘హిట్ అండ్ రన్’ కేసు నమోదు చేసి.. మిహిర్ షాను పట్టుకున్నారు.
సీసీఫుటేజీ చెక్ చేయగా.. బార్లో మద్యం తాగి, రూ. 18 వేల బిల్లు చెల్లించినట్లు తేలింది. పైగా, తన కారు డ్రైవర్‌ను బలవంతంగా వేరే సీట్లోకి మార్చి మిహిర్ షా డ్రైవింగ్ చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో నిందితుడు మిహిర్ షా పిటిషన్ దాఖలు చేశాడు. శుక్రవారం విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఏజీ మషీ ధర్మాసనం.. ‘‘నీలాంటి అబ్బాయిలు గుణపాఠం నేర్చుకోవాల్సిందే. మద్యం తాగి కారు నడపడమే కాకుండా.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నావు. అక్కడి నుంచి పారిపోయావు. నీలాంటోడు కొన్నాళ్లు జైల్లో ఉంటే తెలిసి వస్తుంది. డబ్బు, పలుకుబడి ఉన్న కుటుంబంలో పుట్టి.. రోడ్ల మీదికి వచ్చి హంగామా చేస్తే సహించేది లేదు. కొన్నాళ్లు నువ్వు ఊచలు లెక్కపెట్టాల్సిందే” అని తేల్చిచెప్పింది.
