మనీ ల్యాండరింగ్ కేసులపై సుప్రీం కీలక తీర్పు

మనీ ల్యాండరింగ్ కేసులపై సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో సోదాలు, ఆస్తుల అటాచ్, అరెస్టు చేయడం వంటి అధికారాలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఉంటాయని స్పష్టం చేసింది. ఈడీ అరెస్టులు ఏకపక్షం కాదని చెప్పింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని కొన్ని ప్రొవిజన్లను సవాల్ చేస్తూ ఎంపీ కార్తీ చిదంబరం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తదితరులు పిటిషన్లు వేశారు. ఇవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాటిల్లో పేర్కొన్నారు. మొత్తం 200కు పైగా పిటిషన్లు రాగా.. వాటిపై సుప్రీం ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. బుధవారం జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. చట్టంలోని అన్ని ప్రొవిజన్లను సమర్థిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.  

ఈసీఐఆర్ తప్పనిసరేం కాదు.. 

మనీ ల్యాండరింగ్ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకునే టైమ్​లో ఈడీ కారణాలు చెప్పాల్సిన అవసరంలేదని సుప్రీం తెలిపింది. అరెస్టు చేసే టైమ్ లో మాత్రం, అందుకు గల కారణాలను చెబితే సరిపోతుందని చెప్పింది. ‘‘ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్) అనేది ఎఫ్ఐఆర్​తో సమానం కాదు. అది ఈడీ ఇంటర్నల్ డాక్యుమెంట్. ఈసీఐఆర్​ను నిందితులకు ఇవ్వడమనేది తప్పనిసరేం కాదు. అరెస్టుకు కారణాలను చెబితే సరిపోతుంది” అని పేర్కొంది. ఈడీ అధికారులు పోలీసులు కాదన్న కోర్టు.. వాళ్లు విచారణ సమయంలో రికార్డు చేసే వాంగ్మూలాలను చట్టబద్ధమైన సాక్ష్యాలుగా పరిగణించొచ్చని తెలిపింది. ఈ చట్టం కింద బెయిల్ పొందేందుకు ఉన్న షరతులు చట్టబద్ధమైనవేనని స్పష్టంచేసింది. అవి ఏకపక్షం కాదని చెప్పింది.