
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్టీ గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం"పౌష్టిక ఆహారం, పరిశుభ్రమైన గురుకులం" అనే నినాదంతో 'సురక్ష' పేరిట ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో 9 రీజియన్లలో పనిచేస్తున్న 185 మంది వంట మాస్టర్లకు శిక్షణ ఇవ్వడానికి 18 మంది ఉత్తమ వంట మాస్టర్లను ఎంపిక చేశారు. కిచెన్ శుభ్రంగా ఉంచడం, పరిశుభ్రమైన వంట విధానాలను అనుసరించడం వంటి అంశాలపై శిక్షణ ఇప్పించారు.
అనంతరం వండిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించారు. కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పబ్లిక్ హెల్త్ నిపుణులు, రిటైర్డ్ ఫుడ్ సేఫ్టీ లైసెన్సింగ్ ఆఫీసర్ విజయకుమార్ పాల్గొని, వంట మాస్టర్లకు సలహాలు, సూచనలు అందజేశారు. దీనిపై ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి స్పందిస్తూ..విద్యార్థుల ఆరోగ్యం ప్రధాన లక్ష్యమని, ఫుడ్ పాయిజనింగ్ నివారించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉత్తమ వంట మాస్టర్లను ఎంపిక చేసి, వారి ద్వారా మిగతా సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.
ఇకపై ఇదే తరహాలో పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని వంట మాస్టర్లను ఆదేశించామన్నారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన పోషణ్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్‌లను కూడా ఎస్టీ గురుకులాల్లో అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.