
- తాగునీళ్లు, సాగునీళ్లు అమ్మి వ్యాపారం చేస్తమన్నరు: సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చలో సీఎం ఫైర్
- అప్పులు, నిధులు కలిపితే కాళేశ్వరం ఖర్చు ఎక్కడికోపోతది
- ఆ ప్రాజెక్టు అప్పులు, ఖర్చు.. అన్నీ సపరేట్గా చెప్తం
- వాస్తవ పరిస్థితిని చెప్పేందుకే శ్వేతపత్రం
- భగీరథ రాకముందు కూడా ప్రతీ ఇంటికి నీళ్లొచ్చినయని కామెంట్
హైదరాబాద్, వెలుగు : తాగునీళ్లను, సాగునీళ్లను సైతం అమ్ముతామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి, పరిశ్రమలకు, తాగడానికి నీళ్లు అమ్ముతం. మొత్తం వ్యాపారమే చేస్తం. మా ప్రభుత్వం ఉన్నదే అందుకు. మేం సేవ చేయం’’ అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రంపై బుధవారం చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ నీళ్లు రైతులకు అమ్ముతం.. ఇండస్ర్టీస్ కు అమ్ముతం.. ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లన్నీ పైసలకే అమ్ముతం. ఉచితంగా ఎవరికీ ఇవ్వం.. ఒక్క ఏడాదికే రూ.5,199 కోట్ల ఆదాయం వస్తది” అని చెప్పి అప్పులు చేశారని ఆయన మండిపడ్డారు. ‘‘ఈ అప్పుల కోసం సంతకాలు చేసింది అక్కడ కూర్చున్న మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి.. కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గమైన చర్య. కాళేశ్వరానికి పూర్తి అంచనా వ్యయం ఎంత? తీసుకున్న అప్పులు ఎన్ని ? రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎన్ని? ఎంత ఖర్చు చేశారు? అన్న వివరాలన్నీ బయటపెడతాం” అని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు అన్నది పూర్తిగా అబద్ధమన్నారు. ఆ ప్రాజెక్టు కోసం రూ.97,449 కోట్ల లోన్లు మంజూరు చేయించుకున్నారని చెప్పారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులనూ ఖర్చు చేసిందని, ఈ రెండూ కలిపితే ప్రాజెక్టు వ్యయం ఎక్కడికో పోతుందన్నారు.
2014కు ముందు మంచినీళ్లు తాగలేదా?
రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లుగా చెబుతున్నారని.. ప్రజలు 2014కు ముందు మంచినీళ్లు తాగలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారని సీఎం వెల్లడించారు. శివుడి తలమీద గంగను భూమి మీదకు తెచ్చి కాళేశ్వరం ద్వారా పంపిణీ చేసి అద్భుతం చేసి జీవితాలను ధన్యం చేసినట్లుగా గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అప్పులు చేసిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ నివేదిక ఇచ్చింది. పద్ధతి మార్చుకోవాలంటూ గత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అసెంబ్లీని తప్పుదోవ పట్టించేలా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం అన్నారు.
పదేండ్లు కేసీఆర్, హరీశ్‌లే సాగునీటి మంత్రులు
హరీశ్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని సీఎం రేవంత్ అన్నారు. మంత్రి కొండా సురేఖ కల్పించుకుంటూ ‘ఏడు సార్లు’ అని అన్నారు. ‘‘నాకు తెలుసు అక్క. ఆయన ఐదు సార్లే గెలిచారు. బై ఎలక్షన్లు కూడా ఆయన లెక్కల్లో వేసుకున్నారు. అవసరమైతే వాళ్ల మామ గెలిచినవి కూడా కలుపుకుంటారు. ఫస్ట్ టర్మ్ లోనే హరీశ్ రావు సాగునీటి మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆ శాఖను కేసీఆర్ చూసుకున్నారు. గత పదేండ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ చూడలేదు. కాళేశ్వరం అంచనాలు రూ.80 వేల కోట్లు అయితే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.97,449 కోట్లు మంజూరైతే అందులో రుణంగా రూ.79,287 కోట్లు విడుదలైంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ నుంచి నిధులు కేటాయించింది. ఆ లెక్కలను శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ లెక్కలను పూర్తి వివరాలతో సపరేట్ గా సభకు తెలియజేస్తాం” అని సీఎం స్పష్టం చేశారు.
ఆర్థిక విధ్వంసం సృష్టించారు
గత సర్కారు విద్యుత్ సంస్థల ఆస్తులను తాకట్టు పెట్టి రూ.4,972 కోట్లకు పైగా అప్పులు చేసిందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాలు కడుపు కట్టుకొని ఆస్తులు సృష్టించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.13.72 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇయ్యలే. ఫీజు రీయింబర్స్ మెంట్బకాయిలు రూ.4 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయక ఆస్పత్రుల్లో పేషంట్లను చేర్చుకోవడం లేదు. నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి ఉన్నదంతా దోచుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. స్కూళ్లలో వంటలు చేసే కార్మికులకు జీతభత్యాలు కూడా ఇవ్వడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లు నిరసన తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో పని చేసే వాళ్లకూ సౌకర్యాలు కల్పించడంలేదు” అని సీఎం అన్నారు.
అఖిలపక్షం సలహాలతోనే నిర్ణయాలు
కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసమే ఆలోచిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేశా. బీఆర్ఎస్ వారి కుటుంబ తగాదాలను సభలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటాం. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తం” అని సీఎం వెల్లడించారు.
వాస్తవ పరిస్థితి చెప్పేందుకే శ్వేతపత్రం
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు చెప్పేందుకే పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే తాము శ్వేతపత్రం విడుదల చేశాం తప్ప.. గ్యారంటీలను ఎగ్గొట్టేందుకు కాదన్నారు. ‘‘ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు నుంచి వివరాలు తీసుకున్నాం. బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులకు ఉండేవి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇందులో సగం రోజులు కూడా లేవు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి.. అవమానించడానికి కాదు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే” అని సీఎం చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక అని, ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోవచ్చన్నారు.
‘బంగారు’ బాతును కోసుకుతిన్నరు
పేదోళ్లందరికీ పెద్ద కొడుకునని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాలా తీయించారని, రెండు, మూడు నెలల తర్వాత పింఛన్లు ఇస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి ఔటర్ రింగ్ రోడ్డులాంటి గొప్ప ఆస్తిని సృష్టిస్తే ఒకేసారి రూ.7 వేల కోట్లకు అమ్ముకున్నారు. బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకేసారి కోసుకుతిన్నరు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైన్ షాపుల టెండర్లు పిలిచి ఆ సొమ్ము దండుకున్నారు. కొత్త ప్రభుత్వానికి నిధులు అందుబాటులో లేకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారు” అని విమర్శించారు.
ప్రతిపక్షాల సిగ్గు చూడాల్నా.. ప్రజలను కాపాడాల్నా?
సత్యహరిశ్చంద్రుడే మరోజన్మ ఎత్తి వచ్చినట్టుగా హరీశ్ రావు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన ఆర్టీసీ ఆస్తులను కుదువ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. ఆర్టీసీ ఆస్తులపై రూ.2,886 కోట్ల అప్పులు చేశారని, కాళేశ్వరం కాంట్రాక్టర్లకు రూ.3 వేల కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. ‘‘మేం చెప్తే వాళ్ల సిగ్గు పోతది అంటున్నరు. మేం వాళ్ల సిగ్గు చూడాల్నా.. నాలుగు కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడాల్నా? అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం’’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘రూ.14 లక్షల కోట్లు మేం దిగమింగినం.. మీరేం చేసిండ్రు అని బీఆర్ఎస్ వాళ్లు మాపై దాడి చేస్తున్నరు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. కానీ ఒక్క హామీని నెరవేర్చలేదు. సీఎం హోదాలో 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ ఇచ్చిన నివేదికలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు చెప్పింది. అయినా ఉద్యోగాలు భర్తీ చేయలేదు” అని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ సభ్యులు స్వేచ్ఛగా నిజాలు ఒప్పుకోవాలి
తెలంగాణలో వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించామని.. బీఆర్ఎస్సభ్యులు స్వేచ్ఛగా ఉండాలని, ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన షార్ట్ డిస్కషన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడిన తర్వాత సీఎం జోక్యం చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. మిత్రుడికి తన సూచన అంటూ.. ‘‘బేషజాలకు పోకండీ.. ఇంటికాడ ఆయన (కేసీఆర్) ఉండి టీవీ కంటిన్యూయస్‌గా చూస్తడు.. వెళ్తే మీకు ఇబ్బంది ఉంటది కొంత.. వివరణ చెప్పు కోలేరు.. మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటం.. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకిరీకి విముక్తి కల్పించినం.. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి.. వెట్టి చాకిరీని ఆనాడు కాంగ్రెస్నిషేధించింది.. ఈరోజు మళ్లీ తెలంగాణలో ఇందిరమ్మ రాష్ట్రంలో.. ప్రజా పాలనలో వెట్టిచాకిరీని నిషేధించినం.. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాలి..” అని రేవంత్ సూచించారు.
ఇయ్యాల ఢిల్లీకి సీఎం రేవంత్ సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరు
సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో.. అందులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తారు. అసెంబ్లీ సెషన్ నడుస్తుండడంతో.. గురువారం ఉదయం సభకు వచ్చి.. ఆ తర్వాత మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, స్పెషల్ ఇన్వైటీ అయిన వంశీచంద్ రెడ్డి కూడా సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బరామి రెడ్డి పాల్గొంటారు.