
- నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్
- గాంధీ హాస్పిటల్ అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు మరో ఐదుగురు కూడా!
- సరోగసీ పేరిట సికింద్రాబాద్‌లోని దంపతుల నుంచి రూ. 40 లక్షలు వసూలు
- పేదింటి మహిళకు పుట్టిన బిడ్డను రూ. 90 వేలకు కొని.. సరోగసీబిడ్డగా ఫ్రాడ్
- డీఎన్ఏ టెస్టులు చేయాలని కోరినా వినని సెంటర్ నిర్వాహకులు
- లీగల్ సమస్యలు వస్తాయంటూ దంపతులకు నమ్రత కొడుకు బెదిరింపులు
- వేరే దగ్గర డీఎన్ఏ టెస్టులు చేస్కోవడంతో వెలుగులోకి బాగోతం
- 2021లోనే ముగిసిన క్లినిక్ పర్మిషన్.. అయినా అక్రమంగా నిర్వహణ
- వివరాలను వెల్లడించిన నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
పద్మారావునగర్, వెలుగు: సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సరోగసీముసుగులో బిడ్డను కొని తెచ్చి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్‌వో వెంకట్‌తో కలిసి ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాజస్తాన్‌కు చెందిన దంపతులు నాలుగేండ్లుగా సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. చాలా ఏండ్లుగా సంతానం కలగకపోవడంతో వీరు నిరుడు ఆగస్టులో సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించారు. అయితే.. మీరు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనడానికి వీలు పడదని, సరోగసీ ఉత్తమ మార్గమని ఆ దంపతులకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్ ఎ.నమ్రత చెప్పారు. దాంతో సరోగసీ(అద్దె గర్భం) కి ఒప్పుకున్న దంపతుల నుంచి రూ.30 లక్షలను క్లినిక్ నిర్వాహకులు వసూలు చేశారు. వైద్య పరీక్షల కోసం దంపతులను ఇద్దరిని విజయవాడకు పంపించారు. అక్కడ వీరు శాంపిల్స్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత సరోగసీ కోసం గర్భం మోసే మహిళ దొరికిందని దంపతులను నమ్మించారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ నెలలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వారు ఆ దంపతులకు ఫోన్ చేసి.. వైజాగ్‌లో అద్దెగర్బం ధరించిన మహిళ డెలివరీ అయిందని, మగబిడ్డ జన్మించాడని, సీ సెక్షన్ అయినందున మరో రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి, వారి వద్ద నుంచి అదనంగా ఆ డబ్బులు వసూలు చేశారు. వైజాగ్‌కు వెళ్లిన దంపతులకు.. అక్కడి క్లినిక్వారు ఓ బాబును ఇచ్చారు. అయితే.. పుట్టిన బాబు ముఖ కవళికలు, రంగు తమకు మ్యాచ్ కాకపోవడంతో ఆ దంపతులకు కొంత అనుమానం వచ్చింది. ఒప్పందం ప్రకారం.. ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉండగా, దంపతులు చాలాసార్లు అడిగినప్పటికీ అందుకు క్లినిక్ వాళ్లు స్పందించకుండా దాటవేశారు. ఈ విషయమై క్లినిక్ ఓనర్ డాక్టర్ నమ్రతను దంపతులు నిలదీశారు. దాంతో వారిని నమ్రత బెదిరించింది. క్లినిక్ నడిచే బిల్డింగ్‌లోనే డా. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా ప్రాక్టిస్ చేస్తూనే, క్లినిక్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలా మోసపోయిన దంపతులకు జయంత్ కృష్ణ.. లీగల్‌గా మీరు కూడా ఇబ్బంది పడతారని, కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారని బెదిరించాడు. చివరికి చేసేదేమి లేక దంపతులు తమ సొంత ఖర్చుతో ఢిల్లీలో డీఎన్ఏ టెస్టులు చేయించుకున్నారు. డీఎన్ఏ రిపోర్టును చూసి దంపతులు షాక్ తిన్నారు. తండ్రి డీఎన్ఏతో బాబు డీఎన్ఏ మ్యాచ్ కావడం లేదని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ విషయమై పలుమార్లు అడుగుదామని దంపతులు క్లినిక్‌కు వెళ్తే.. డాక్టర్లు స్పందించకపోగా, పైగా వీరినే బెదిరించారు. చివరికి గోపాలపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, జరిగిన మోసాన్ని వివరించారు. స్పందించిన నార్త్ జోన్ పోలీసులు డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో దాదాపు గత రెండు వారాలుగా దర్యాప్తు చేసి, పలు కీలక అంశాలపై పురోగతి సాధించారు.
పేద గర్భిణిని వైజాగ్ తరలించి..!
అసలు భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించి, వారికి రూ. 90 వేల వరకు ఇచ్చి, పుట్టబోయే బిడ్డ కొనుగోలుకు ప్లాన్ వేశారు. సరిగ్గా డెలివరీ సమయంలో ఆ పేదింటి గర్బిణి దంపతులను విమానంలో హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు పంపించి.. అక్కడ డెలివరీ చేయించారు. డెలివరీ తర్వాత ఆ విషయం సరోగసికి ఒప్పుకున్న దంపతులకు చెప్పి.. మీ బాబే అంటూ అప్పగించారు.
క్లినిక్ అనుమతి ముగిసినా వేరే వాళ్ల సర్టిఫికెట్తో!
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనుమతి గడువు 2021లోనే ముగిసిందని, అయినా వేరే సర్టిఫైడ్ డాక్టర్ సూరి శ్రీమతి పేరు మీద అక్రమంగా డాక్టర్ నమ్రత సృష్టి క్లినిక్‌ను నడిపిస్తున్నారని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వెంకట్ తెలిపారు. వాస్తవానికి ఇండియాలో కమర్షియల్ సరోగసికి అనుమతి లేదని, కేవలం మానవతా దృక్పథంతో దగ్గరి వారితో అద్దె గర్భం పద్ధతి ఉందని అన్నారు. కాగా.. ఈ కేసులో సరోగసీ లేదని, పేద దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి బాధిత దంపతులకు ఇచ్చారన్నారు. సృష్టి సెంటర్‌పై సోదాల్లో తాము కూడా పాల్గొన్నామన్నారు. 2021లో క్లినిక్ అనుమతులు క్లోజ్ అయ్యాయని, దాంతో తాము అప్పట్లోనే ఆ క్లినిక్‌ను మూసివేస్తూ క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామని తెలిపారు. కానీ, అక్రమంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను నడుపుతున్నారని అన్నారు. క్లినిక్ సెంటర్ లో థియేటర్‌ను గుర్తించామని, అనస్థీషియా ల్యాబ్, బెడ్స్, ఏడు రకాల అనాలసిస్ చేసే మెడికల్ ఎక్విప్ మెంట్ ఉందని పేర్కొన్నారు. డస్ట్ బిన్ చెక్ చేస్తే రెగ్యులర్‌గా ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఆసుపత్రి
నడుపుతున్నారని పేర్కొన్నారు.
డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు సహా 8 మంది అరెస్ట్
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సరోగసీమోసం కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని, రెండు రాష్ట్రాల్లోని సృష్టి బ్రాంచుల్లో తమ పోలీసు బృందాలు, వైద్యాధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేయగా, వీరిని అంతకన్నా ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ (ఏపీ, తెలంగాణ) నిర్వహకురాలు డాక్టర్ అతలూరి నమ్రత (64), ఆమె కుమారుడు, క్లినిక్ మేనేజర్ జయంత్ కృష్ణ(25), సృష్టి వైజాగ్ బ్రాంచీ మేనేజర్ కళ్యాణి (40), ల్యాబ్ టెక్నిషియన్, ఎంబ్రలాజిస్ట్ చెన్నారావు(37), గాంధీ ఆస్పత్రి అనిస్థిషీయా అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్గుల సదానందం(41), అస్సాంకు చెందిన సిబ్బంది సంతోషి(38), మహ్మాద్ అలీ అదిక్(38), నస్రీన్ బేగం(25) ఉన్నారు. క్లినిక్‌లోని మెడికల్ ఎక్విప్ మెంట్, మెడిసిన్, మొబైల్ ఫోన్స్, డిజిటల్ డివైసెస్, కేసు రికార్డులు, సరోగసి, ఐవీఎప్ డాక్యుమెంట్లును స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రూ.4 వేలకు స్పెర్మ్ కొని..
రూ. 4 వేలకు స్పెర్మ్‌ను కొనుగోలు చేస్తున్న హైదరాబాద్‌లోని కొన్ని క్లినిక్‌లు అక్రమంగా వాటిని గుజరాత్, అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు పంపిస్తున్నట్లు వెల్లడైంది. వీరిని కూడా విచారిస్తున్నట్లు డీసీపీ రష్మీ తెలిపారు. డాక్టర్ నమ్రతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐవీఎప్ ఫెయిల్యూర్, సరోగసీ అక్రమాలపై పదికి పైగా కేసులున్నట్లు వెల్లడించారు. డాక్టర్నమ్రత 1995లో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించి, 1998లో ఫెర్టిలిటీ, ఐవీఎప్ రంగంలోకి వచ్చి.. సరోగసీ, ఐవీఎఫ్‌ల పేరిట భారీగా అక్రమార్జన చేసినట్లు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, కొండాపూర్‌లో సృష్టి టెస్ట్ట్యూబ్ సెంటర్ బ్రాంచీలను నెలకొల్పి, మెడికల్ దోపిడీకి తెరతీశారని డీసీపీ పేర్కొన్నారు. ఒక్కో ఐవీఎఫ్, సరోగసీపేరున రూ. 20 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.