భారీగా పెరిగిన.. ఆన్​లైన్​ మోసాలు

భారీగా పెరిగిన..  ఆన్​లైన్​ మోసాలు

న్యూఢిల్లీ:  ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా, ఎన్ని కొత్త సాఫ్ట్​వేర్లను డెవెలప్​ చేస్తున్నా ఆన్​లైన్​ ఆర్థిక మోసాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ వీటి సంఖ్య పెరుగుతూనే ఉందని తాజాగా నిర్వహించిన ఒక సర్వే తేల్చింది. మనదేశంలో గత మూడేళ్లలో 39 శాతం కుటుంబాలు ఆన్​లైన్ ​ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నాయి. మోసపోయిన వారిలో కేవలం 24 శాతం కుటుంబాలు మాత్రమే తిరిగి తమ డబ్బును పొందాయి.  లోకల్​ సర్కిల్స్​ నిర్వహించిన సర్వే ద్వారా ఈ సంగతులు తెలిశాయి. 

ఎక్కువ మంది కార్డుల వల్ల మోసపోయారు. సర్వేలో పాల్గొన్నవారిలో 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ మోసాల బారినపడ్డారు. 13 శాతం మంది ‘అమ్మకాలు’, ‘కొనుగోళ్లు’  కారణంగా డబ్బులు పోగొట్టుకున్నామని చెప్పారు. నకిలీ వెబ్​సైట్ల ద్వారా మోసపోయామని వీరిలో కొందరు చెప్పారు. కొన్ని వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు ఆర్డర్​ ఇచ్చాక డెలివరీ చేయకుండా మోసగించాయని 13 శాతం మంది వెల్లడించారు. పది శాతం మంది ఏటీఎం కార్డ్ మోసాలకు గురయ్యారు. మరో 10 శాతం మంది బ్యాంక్ ఖాతా ఫ్రాడ్​కు గురికాగా, 16 శాతం మంది ఇతర పద్ధతుల్లో డబ్బును నష్టపోయారు.  

"సర్వేలో పాల్గొన్న వారిలో 30 శాతం కుటుంబాలు ఆర్థిక మోసాల బారినపడ్డాయి. వీరిలో 30 శాతం మంది ఆన్​లైన్​ మోసాల బారినపడ్డారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా మోసానికి గురయ్యారు. అయితే 9 శాతం మంది తమ కుటుంబంలోని అనేక మంది  గత మూడేళ్లలో ఆర్థిక మోసానికి గురయ్యారని వెల్లడించారు. మిగిలిన వారిలో 57 శాతం మంది తాము లేదా వారి కుటుంబ సభ్యులు అలాంటి మోసాల నుంచి తప్పించుకున్నామని చెప్పారు. నాలుగు శాతం మంది మాత్రం స్పష్టమైన జవాబు ఇవ్వలేదు ” అని  రిపోర్ట్​  తెలిపింది.

331 జిల్లాల్లో సర్వే..

భారతదేశంలోని 331 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించి 32 వేల రెస్పాన్స్​లు తీసుకున్నారు. దాదాపు 39 శాతం  రెస్పాండెంట్లు టైర్–1 నగరాల నుంచి, 35 శాతం మంది టైర్– 2 నుంచి,  26 శాతం మంది రెస్పాండెంట్లు టైర్ 3, 4 నగరాల నుంచి,  గ్రామీణ జిల్లాల నుంచి ఉన్నారు. ఆన్​లైన్​ ఫ్రాడ్​ వల్ల పోయిన డబ్బును తిరిగి పొందారా ? అని అడిగినప్పుడు,  11,305 రెస్పాన్స్ లలో 24 శాతం మంది తమ డబ్బును వాపసు పొందగలిగామని తెలియజేయగా, 70 శాతం మంది మాత్రం పొందలేకపోయామని చెప్పారు. 

18 శాతం మంది సంబంధిత ప్లాట్‌‌‌‌ఫారమ్​కు ఫిర్యాదు చేసి డబ్బును తిరిగి పొందామని వివరించారు. ఆరు శాతం మంది అధికారులకు ఫిర్యాదు చేసి డబ్బును తిరిగి పొందామని పేర్కొన్నారు.  అయితే, 41 శాతం మంది 'తమ కంప్లయింట్​ఇంకా పెండింగ్‌‌‌‌లో ఉంది' అని అన్నారు. మరో 17 శాతం మంది 'ఎక్కడికీ వెళ్లలేకపోయాం. ఎవరికీ ఫిర్యాదు చేయలేకపోయాం’ అని నిస్సహాయత వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 12 శాతం మంది ఫిర్యాదు కూడా చేయకూడదని నిర్ణయించుకున్నారు.