నెట్టింట్లో బందీలం!

నెట్టింట్లో బందీలం!

బిజినెస్​ డెస్క్​, వెలుగు: కరోనా మహమ్మారి వల్ల ఎక్కువ సేపు ఖాళీగా ఉండాల్సి రావడంతో మనదేశంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది.  విచ్చలవిడిగా స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, సోషల్‌‌‌‌ మీడియాను వాడటంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిందని పేర్కొంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌కు బానిసలమయ్యామని,  సైబర్‌‌‌‌ ప్రపంచం నుంచి బయటపడలేకపోతున్నామని తమ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు వెల్లడించారని నార్టన్‌‌‌‌ లైఫ్‌‌‌‌లాక్‌‌‌‌ తెలిపింది. సైబర్‌‌‌‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌‌‌‌ అందించే ఈ కంపెనీ నెట్‌‌‌‌యూజర్ల ఆలోచనలు తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వే కోసం వెయ్యి మందికిపైగా ఇండియన్ల నుంచి వివరాలు తీసుకుంది. ఇంటర్నెట్‌‌‌‌ లేకుండా ఉండలేని స్థితికి వచ్చామని 66 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. కరోనా కారణంగా స్క్రీన్‌‌‌‌పై గడిపే టైం చాలా పెరిగిందని ప్రతి పది మందిలో ఎనిమిది మంది చెప్పారు. వీరంతా తమ చదువు/పని పూర్తయిన తరువాత కూడా నెట్‌‌‌‌తోనే గడిపారు. ఇండియన్‌‌‌‌ అడల్ట్స్‌‌‌‌ కనీసం రోజుకు 4.4 గంటలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో గడిపారు. స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ను విపరీతంగా వాడుతున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది చెప్పారు. 

ఆరోగ్యం దెబ్బతింది...

చాలా సేపు కంప్యూటర్‌‌‌‌/మొబైల్‌‌‌‌ఫోన్‌‌‌‌/స్మార్ట్‌‌‌‌టీవీ స్క్రీన్‌‌‌‌కు అతుక్కొనే ఉండటంతో ఆరోగ్యం దెబ్బతిందని 74 శాతం మంది రెస్పాండెంట్లు అంగీకరించారు. తమ మానసిక ఆరోగ్యం కూడా పాడయిందని చెప్పిన వారి సంఖ్య 55 శాతం వరకు ఉంది. దోస్తులతో గడపడం, హైకింగ్‌‌‌‌ వంటి ఆటలు ఆడటం వల్ల స్క్రీన్‌‌‌‌టైమ్‌‌‌‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని 76 శాతం మంది వివరించారు. స్మార్ట్‌‌‌‌ఫోన్లు, టీవీల వంటి డివైజ్‌‌‌‌లను తయారు చేసే కంపెనీలను నమ్మలేమని చాలా మంది అన్నారు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే భయంతో ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నామని 48 శాతం మంది అన్నారు. వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని 40 శాతం మంది పేర్కొన్నారు. కంపెనీలు మన డేటాను తప్పుడు పనులకు వాడవని ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ టైం తగ్గించాలి...

 ‘‘చాలా మంది బయట చేసుకోగల పనుల కోసం కూడా కంప్యూటర్లు లేదా స్మార్ట్‌‌‌‌ఫోన్లపై ఆధారపడుతున్నారు. కరోనా వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మనం అర్థం చేసుకోవచ్చు.  ప్రతి ఒక్కరూ వారి ఆన్-స్క్రీన్,  ఆఫ్-స్క్రీన్ సమయం మధ్య ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌‌‌‌ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ టైం తగ్గించడం వల్ల వారి ఆరోగ్యం,  మరీ ముఖ్యంగా వారి పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్‌‌‌‌ ఉండదు ”అని నార్టన్ లైఫ్ లాక్‌‌‌‌  ఇండియా & సార్క్ దేశాల డైరెక్టర్‌‌‌‌ (సేల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ మార్కెటింగ్) రితేష్ చోప్రా అన్నారు. ‘‘కరోనా వల్ల పెరిగిన మరో సమస్య.. సైబర్ నేరాలు. మహమ్మారి సమయంలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెదిరింపులు ఎక్కువయ్యాయి. తమ డివైజ్‌‌‌‌లను ఎలా,  ఎక్కడ ఉపయోగించాలో యూజర్లు తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సౌకర్యాల కోసం సెక్యూరిటీని ఫణంగా పెట్టకూడదు.  పర్సనల్‌‌‌‌ లేదా రహస్య సమాచారం కోల్పోవడం వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈ వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్‌‌‌‌.  సైబర్ సెక్యూరిటీ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం’’ అని ఆయన వివరించారు. నార్టన్‌‌‌‌ లైఫ్‌‌‌‌లాక్‌‌‌‌ కోసం హారిస్‌‌‌‌పోల్‌‌‌‌ ఇండియాలో ఈ సర్వేను నిర్వహించింది. 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న 1,004 మందితో సర్వేయర్స్‌‌‌‌ మాట్లాడారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌‌‌‌ ఎనిమిది వరకు జరిగింది. వయసు, లింగం, ప్రాంతం, చదువు ఆధారంగా సమాచారాన్ని వేరు చేసి రిపోర్టును తయారు చేశారు.