అవసరాలు తీరుస్తమనొచ్చి పానాలే తీస్తున్నయ్

అవసరాలు తీరుస్తమనొచ్చి పానాలే తీస్తున్నయ్
కరోనా మహమ్మారి దేశంలోని సామాన్యుల ఆర్థిక స్థితిగతుల్ని దారుణంగా దెబ్బకొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి జనాలకు చేయూత ఇస్తున్నట్టు తెర మీదకు వచ్చిన మరో మహమ్మారి ఆన్​లైన్​ లోన్ మాఫియా. సామాన్యుల అవసరాలు తీరుస్తామంటూ వచ్చిన ఈ లోన్​ యాప్స్​ ఇప్పుడు వారి ప్రాణాలనే తీసుకెళ్లిపోతున్నాయి. ఎలాంటి షూరిటీ లేకుండా ఆధార్, పాన్ కార్డ్, ఫొటోతో సెల్​ ఫోన్ లో ఒకే ఒక్క క్లిక్ తో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని లోన్​ యాప్స్​ సోషల్​ మీడియాలో యాడ్స్​ ఇచ్చాయి. ఈ ఆకర్షణీయమైన ప్రకటనలను చూసిన లక్షలాది మంది దాని వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలియక ఉచ్చులో పడిపోయారు. గౌరవం, పరువు అనే బలహీనతలపై కొన్ని వేల కోట్లు సంపాదించడానికి ఆన్​లైన్​ లోన్​ మాఫియా అలవాటు పడింది. దేశంలో టెక్నలాజికల్​ రివల్యూషన్​ ఆధారంగా జరిగిన ఎన్నో మోసాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన చట్టాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ముఖ్యమైనది. ఆ చట్టంలోని కీలక సెక్షన్ల కింద ఇటీవల కేంద్రం చైనాకు చెందిన పబ్ జీ, టిక్ టాక్ లాంటి వందలాది యాప్స్ ను బ్యాన్​ చేసింది. యూజర్ల వ్యక్తిగత వివరాలను ఈ యాప్స్ దొంగిలించి చైనాకు చేరవేస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఇది నిర్ధారణ కావడంతో యాప్స్​పై బ్యాన్​ విధించారు. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇన్​స్టంట్​ ఆన్​లైన్​ లోన్​ యాప్స్​ ఏకంగా లోన్ తీసుకున్న వ్యక్తి ఫోన్ లోని పర్సనల్​ ఫొటోలు కూడా చోరీ చేస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన వారంలో అధిక వడ్డీతో తిరిగి కట్టకపోతే లోన్​ తీసుకున్న వ్యక్తి ఫోన్ లోని కాంటాక్ట్స్ కు ఫోన్​ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ.. తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేస్తున్నాయి. సూసైడ్​ చేసుకుంటున్నరు హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్​ వేర్​ ఇంజనీర్​ సునీల్. కరోనా లాక్​డౌన్​ వల్ల ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఓ లోన్ యాప్ నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. కొన్ని వేల రూపాయలు అధిక వడ్డీగా, లేట్ పేమెంట్ పెనాల్టీలుగా చెల్లించాడు. అయితే ఒకసారి తీసుకున్న సొమ్ము 7 రోజుల్లో చెల్లించలేకపోవడంతో ఆన్​లైన్​ లోన్ మాఫియా అసలు రూపం బయటపడింది. సునీల్​ ఫోన్ కాంటాక్ట్స్​లోని ఫ్రెండ్స్, రిలేటివ్స్​ నంబర్స్ తో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్​ చేసి.. అందులో అతని ఫొటోలను మార్ఫ్​ చేసి.. ‘‘ఇతను లోన్ దొంగ, లోన్ ఫ్రాడ్”అంటూ మెసేజ్​లు పెట్టడం మొదలుపెట్టింది. ఆ గ్రూప్ ని తీసేయాలని లోన్ యాప్ రికవరీ ఏజెంట్స్ ని ప్రాధేయపడినా ఏ మాత్రం కనికరించలేదు. ఇంకాస్త ముందుకెళ్లి అతని పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్​ కు ఫోన్లు చేసి బూతులు తిట్టారు. దీంతో పరువు పోయిందని సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ చనిపోయినా అతని పేరెంట్స్​ను పెనాల్టీతో పాటు లోన్ సొమ్ము చెల్లించాలని వేధించడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితే సిద్దిపేట కు చెందిన ఓ యువతికి, మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ కు ఎదురవడంతో వారు కూడా సూసైడ్​ చేసుకున్నారు. ఇవన్నీ ఆన్​లైన్​ లోన్ యాప్స్​ అకృత్యాలే. ఆరు నెలల్లో 21 వేల కోట్ల లావాదేవీలు మేం ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్.. పోలిస్​ టీమ్స్​ను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట, బేగంపేటలోని ఆన్​లైన్​ లోన్​ మాఫియా కాల్ సెంటర్స్ పై దాడులు చేసిన పోలీసులు పలువురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తమ వేట కొనసాగించిన తెలంగాణ పోలీసులు దేశంలోని పలు నగరాల్లోని కాల్ సెంటర్స్ పై దాడులు చేసి కీలక సూత్రధారులను పట్టుకున్నారు. చైనాకు చెందిన లాంబో అనే వ్యక్తిని ఢిల్లీ ఎయిర్​పోర్ట్​లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడు పలు బ్యాంక్​ అకౌంట్ల ద్వారా ఆరు నెలల్లో రూ.21 వేల కోట్ల లావాదేవీలు నడిపినట్టు ప్రకటించారు. అయినా కూడా ఆన్​లైన్​ లోన్​ మాఫియా ఆగడాలు ఆగలేదు. ఎప్పటికప్పుడు బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నా.. ఈ అంశం కత్తి మీద సాములాగే మారింది. సామాన్యుడి ధైర్యం దెబ్బతీసి, మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు పురిగొల్పే ఈ రాక్షస క్రీడకు తెరదించి దేశం నుంచి తరిమి కొట్టేలా పోరాటం చేస్తాం. లక్షల్లో బాధితులు.. పరువు అనే బలహీన అంశంపై ముప్పేట దాడి చేయడమే ఈ ఆన్​లైన్ లోన్ మాఫియా వ్యూహం. ఈ విషయం గత నవంబర్ లో విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మా లీగల్ ఏజెన్సీ దృష్టికి తీసుకువచ్చింది. ఆ కేసును లోతుగా పరిశీలించి అసలు ఎంత మంది బాధితులు ఉన్నారో తెలుసుకుందామని ఆన్​లైన్ లోన్ మాఫియా బాధితులు ఎవరన్నా ఉంటే చెప్పమని సోషల్​ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక్క రోజులో 1,760 మెసేజ్​లు, స్క్రీన్​షాట్స్, ఆడియో రికార్డింగ్స్ వచ్చాయి. నేరుగా బాధితులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగా.. ఒకే వారంలో 10,897 మంది బాధితులు తమ ఆవేదనను వెల్లడించారు. దీంతో వెంటనే సుప్రీంకోర్టులో పిల్​ వేశాం. చాలా రాష్ట్రాల్లో ఈ లోన్​ యాప్స్​పై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. స్పందించిన సుప్రీం.. వెంటనే కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఆర్​బీఐ నుంచి అనుమతులు లేకుండానే.. లోన్​యాప్స్​ పై కంప్లయింట్​ చేయగా.. వెంటనే స్పందించిన ఆర్​బీఐ ఈ ఆన్​లైన్ లోన్ యాప్స్ కు ఎన్​బీఎఫ్​సీ, మైక్రో ఫైనాన్స్ అనుమతులు లేవని స్పష్టం చేసింది. ఆర్​బీఐ వద్ద ఎన్​బీఎఫ్​సీల కింద అనుమతులు పొందని ఈ లోన్ యాప్స్.. రూల్స్​ను తుంగలో తొక్కుతూ 150% నుంచి 350 శాతం వరకూ అధిక వడ్డీలను 7 రోజుల వ్యవధిలో సామాన్యులపై భారం మోపి, భయపెట్టి వసూలు చేస్తున్నాయి. ఇంత శాతం వడ్డీ అని కానీ, ఇన్ని రోజుల్లో కట్టకపోతే ఇంత ఫైన్​ అని కానీ, కట్టలేకపోతే ఈ స్థాయి యాగీ ఉంటుందని కానీ లోన్ తీసుకున్నవారికి కూడా కనీస సమాచారం ఇవ్వడం లేదు. పైగా ‘‘మా యాప్స్ కు ఆర్ బీఐ అనుమతి ఉంది”అంటూ అబద్ధపు ప్రచారంతో ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇటువంటి అధిక, అధర్మ వడ్డీలు వసూలు చేసి, ప్రజలను వేధించే యాప్స్ కు ఆర్ బీఐ ఆమోదం ఉండదని ప్రజలు గమనించాలి.