
- ఏడాదికి సగటున 6-8 శాతం వడ్డీ పొందే వీలు
- ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో బాండ్లు కొనుక్కోవచ్చు
- సెకెండరీ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు కూడా
బిజినెస్ డెస్క్, వెలుగు: ‘‘రిస్క్ ఉండకూడదు కానీ, స్థిరమైన ఆదాయం కావాలి’’.. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎఫ్‌డీల కంటే గవర్న్‌మెంట్ బాండ్ల వైపు ఓసారి చూడడం బెటర్. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆన్‌లైన్‌లో ఈజీగా బాండ్లను కొనడానికి వీలు కలుగుతోంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం తాను జారీ చేస్తున్న చాలా బాండ్లపై సగటున 6–8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ బాండ్లు అంటే మీరు ప్రభుత్వానికి డబ్బు అప్పు ఇవ్వడం. మెచ్యూరిటీ అయ్యాక ఆ డబ్బులను గవర్నమెంట్ తిరిగి ఇస్తుంది.
ఈ మధ్యలో వడ్డీని చెల్లిస్తుంది. "స్థిరమైన రిటర్న్స్, తక్కువ రిస్క్ కోరుకునే వాళ్లకు ప్రభుత్వ బాండ్లు బెస్ట్ ఆప్షన్. రిటైర్ అయినవాళ్లు లేదా సేఫ్‌గా, ఊహించగలిగే ఆదాయం కావాలనుకునే వాళ్లకు ఇవి చాలా ఉపయోగం" అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎనలిస్ట్ రవి సింగ్ చెప్పారు. షేర్ల మాదిరి భారీ రిటర్న్స్‌ను ఈ బాండ్లు ఇవ్వకపోవచ్చు, కానీ గ్యారంటీ రిటర్న్ ఉంటుందని అన్నారు. మెచ్యూరిటీ సమయంలో మీ డబ్బు పూర్తిగా తిరిగి వస్తుందని, ప్రస్తుతం ఉన్న అనిశ్చిత సమయాల్లో ఇవి సేఫ్ ఆప్షన్ అని వివరించారు.
ప్రభుత్వ బాండ్లు అంటే ఏంటి?
ప్రభుత్వ బాండ్ అంటే ప్రభుత్వం డబ్బు సేకరించడానికి జారీ చేసే ఒక రకమైన లోన్ సెక్యూరిటీ. మీరు ఈ బాండ్ కొంటే, ప్రభుత్వానికి డబ్బు అప్పు ఇచ్చినట్టే. ప్రభుత్వం ఒక నిర్దిష్ట తేదీన (మెచ్యూరిటీ డేట్) మీ డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇస్తుంది. అంతవరకు మీకు వడ్డీ చెల్లిస్తుంది. ఉదాహరణకు, బాండ్‌ను ఒక కాగితంగా ఊహించండి.
అది మీరు ప్రభుత్వానికి ఇచ్చిన అప్పును సూచిస్తుంది. ప్రభుత్వం బాండ్లను ముఖ విలువ కంటే తక్కువకు జారీ చేస్తుంది. ఉదాహరణకు ఒక బాండ్ ముఖ విలువ రూ.100 అయితే, మీరు దాన్ని రూ.97కి కొనొచ్చు. ఆ రూ.3 తేడా మీ లాభం. మెచ్యూరిటీ సమయంలో ప్రభుత్వం దాన్ని రూ.100కి మీ నుంచి తిరిగి కొంటుంది. వీటిపై పొందే వడ్డీ అదనం. ఉదాహరణకు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు లేదా వెల్ఫేర్ ప్రోగ్రామ్‌ల కోసం భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా బాండ్లు జారీ చేయొచ్చు.
ఎందుకు కొనాలి?
వీటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఇవి సేఫ్. భారత ప్రభుత్వం డబ్బు తిరిగి ఇస్తామని గ్యారంటీ ఇస్తుంది కాబట్టి, డిఫాల్ట్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. ఫ్రెండ్‌కి డబ్బు అప్పు ఇస్తే తిరిగి రాకపోవచ్చు, కానీ ఈ బాండ్లతో అలాంటి టెన్షన్ లేదు. వీటిపై వడ్డీ రూపంలో
ఊహించగలిగే రిటర్న్స్ పొందొచ్చు.
షేర్ మార్కెట్‌లా భారీ రిటర్న్స్ లేకపోవచ్చు, కానీ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ కంటే ఎక్కువ వస్తుంది. మెచ్యూరిటీ ముందు డబ్బు కావాలంటే, సెకండరీ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ డెట్ మార్కెట్ వంటి వాటి) లో ఈ బాండ్లను అమ్మొచ్చు. ఉదాహరణకు, మీరు రూ. 97కి బాండ్ కొని, ఒక సంవత్సరం తర్వాత దాని మార్కెట్ ధర రూ.99కి పెరిగితే, దాన్ని అమ్మి రూ.2 లాభం పొందొచ్చు.
ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ వెబ్‌సైట్ ద్వారా సామాన్య పెట్టుబడిదారులు బాండ్లలో ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ముందు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి అకౌంట్ క్రియేట్ చేయాలి. కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ రిజిస్టర్ అయిన తర్వాత, అందుబాటులో ఉన్న ప్రభుత్వ బాండ్ల లిస్ట్ చూడండి. వివిధ మెచ్యూరిటీ డేట్స్, వడ్డీ రేట్లతో బాండ్లు ఉంటాయి.
మీ ఫైనాన్షియల్ గోల్స్‌కు సరిపోయేది ఎంచుకోండి. బాండ్ సెలెక్ట్ చేసాక, ఎంత ఇన్వెస్ట్ చేయాలను కుంటున్నారో ఎంటర్ చేసి, ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి. బాండ్ మీ పోర్ట్‌ఫోలియోకి జోడవుతుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆర్‌బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా మీ బాండ్లను ట్రాక్ చేయొచ్చు. డీమాట్ అకౌంట్ లేకుండానే ఇది సులభంగా మేనేజ్ చేయొచ్చు.
ప్రభుత్వ బాండ్ల రకాలు
లాంగ్-టర్మ్ బాండ్లు: ఇవి 5, 10, లేదా 20 సంవత్సరాల మెచ్యూరిటీ కలిగి ఉంటాయి. స్థిరమైన, దీర్ఘకాల రిటర్న్స్ కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్.షార్ట్-టర్మ్ బాండ్లు: ఒక సంవత్సరం కంటే తక్కువలో మెచ్యూర్ అవుతాయి. త్వరగా రిటర్న్స్ కావాలనుకునే వాళ్లకు సూట్ అవుతాయి.జీరో-కూపన్ బాండ్లు: ఇతర బాండ్లలా ఇవి రెగ్యులర్ వడ్డీ చెల్లించవు.
ముఖ విలువ కంటే తక్కువ ధరకు ఇవి అందుబాటులో ఉంటాయి. మెచ్యూరిటీలో పూర్తి విలువకు వీటిని ప్రభుత్వం తిరిగి కొనుగోలు చేస్తుంది. ఆ తేడానే మీ వడ్డీ. ఇన్‌ఫ్లేషన్ -లింక్డ్ బాండ్లు: ఇవి ద్రవ్యోల్బణానికి అనుసంధానించబడి ఉంటాయి. ధరలు పెరిగినప్పుడు మంచి రక్షణ ఇస్తాయి.