పిడుగులపై అలర్ట్ చేయక ప్రాణాలు పోతున్నయ్​

V6 Velugu Posted on Jul 27, 2021

  • ఈ ఏడాది ఇప్పటికే  72 మంది మృతి
  • ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సెన్సార్​ల ఏర్పాటు
  • మన దగ్గర పట్టింపు లేని ప్రభుత్వం
  • పంటభూముల్లో పెరుగుతున్న ప్రాణనష్టం

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏటా పిడుగుపాట్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చనిపోతున్నారు. ఆధునిక టెక్నాలజీతో పిడుగులు ఎక్కడ పడతాయో ముందుగానే తెలుసుకుని ప్రజలను అలర్ట్​ చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​ జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. గతేడాది పిడుగు పడిన ఘటనల్లో 110 చనిపోగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 72 మంది మృతిచెందారు. మరోవైపు పిడుగుపడిన ఘటనల్లో పశువులు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. 

పలు రాష్ట్రాల్లో ముందుగానే అలర్ట్​..
దేశంలోని పలు రాష్ట్రాలు పిడుగు పడినపుడు ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికాలోని ఎర్త్ నెట్ వర్క్, ఇస్రో సహకారంతో ఏపీలో పిడుగుపడే ప్రాంతాలను ముందుగా గుర్తించేందుకు అత్యాధునిక సెన్సార్లను వినియోగిస్తున్నారు. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్న సందర్భంలో గంట ముందే పిడుగు పడే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఆ ఏరియాను లొకేట్ చేసిన అనంతరం ఎస్ఎంఎస్ లతో ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏపీతో పాటు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఏపీలో నాలుగేండ్ల క్రితం పది సెన్సార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రా,  కృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలతోపాటు పలు జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సెన్సార్ విలువ రూ. 20 నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఈ సెన్సార్ల ఆధారంగా వాతావరణ పరిస్థితులను ఇస్రో సహకారంతో పర్యవేక్షిస్తున్నారు. క్లౌడ్ టు బ్రౌన్, క్లౌడ్ టు క్లౌడ్ అనే రెండు పద్ధతుల్లో ఈ సెన్సార్లు వర్క్ చేస్తున్నాయి.

ముందస్తు చర్యలతోనే కంట్రోల్
పిడుగులు సెల్ ఫోన్ టవర్లు, చెట్లపై పడే అవకాశాలు ఎక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రమాద నివారణ చర్యలపై అవగాహన లేక ప్రాణాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు టీవీ, రిఫ్రిజిరేటర్ల వినియోగం నిలిపివేస్తే పిడుగులను చాలావరకు నివారించవచ్చని సైన్స్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తితో పిడుగులు ఏర్పడి భూమి మీదకు వస్తున్నాయి. ఈ పిడుగులు ఎలక్ట్రానిక్ పరికరాలను, నీళ్లను ఆకర్షిస్తాయి. చెరువులు ఉన్న ప్రాంతాల్లో చెట్లు ఉంటే, వర్షం కురుస్తున్న సమయంలో   రైతులు వాటి కిందికి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లపై వర్షపు నీటితో తేమశాతం అధికంగా ఉండడం వల్ల వాటిపై పిడుగులు పడుతుంటాయి. అలాగే ఖనిజాలు ఉండే ప్రాంతాల్లోనూ పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు బీమా పథకాలకు వందల కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. అలాగే పిడుగుపాటు మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

టెక్నాలజీతో ప్రమాదాలు తగ్గించొచ్చు
నాలుగు సంవత్సరాల క్రితం ఏపీలో ఎర్త్​నెట్​వర్క్, ఇస్రో సహకారంతో పిడుగు మరణాలను నివారించేందుకు సెన్సారింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాం. పది కేంద్రాల్లో సెన్సార్ లను ఏర్పాటు చేశాం. ఏపీ డిజాస్టర్ సంస్థ వీటి నిర్వహణ చేపట్టగా యూనివర్సిటీల్లోని సైన్స్ విభాగం పని తీరు పర్యవేక్షిస్తోంది. ప్రజలను ముందుగా హెచ్చరించడం ద్వారా పిడుగు మరణాలతోపాటు భారీ ఆస్తి నష్టాలను నివారిస్తోంది.

– కన్నబాబు, కమిషనర్, విపత్తుల నిర్వహణ, ఏపీ

Tagged Telangana, disaster management, thunders, thunder alert, thunder sensor

Latest Videos

Subscribe Now

More News