పాక్ కెప్టెన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్

పాక్ కెప్టెన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్..టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. జట్టు ఏదైనా...బౌలర్ ఎవరైనా చితక్కొట్టేస్తున్నాడు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్లో  సూర్యకుమార్  రెచ్చిపోయాడు. మొత్తం 6 మ్యాచుల్లో 239 పరుగులు సాధించాడు.  ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. దీంతో టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు.

జోరు కొనసాగుతోంది..
టీ20 వరల్డ్ కప్ ముగిసినా సూర్య జోరు కొనసాగుతోంది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో వీరబాదుడు బాదాడు. కివీస్ బౌలర్లను వారి గడ్డపైనే ఉతికారేశాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 111 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ సాధించేందుకు 32 బంతులు ఎదుర్కొన్న సూర్య..మరో 17 బంతుల్లో సెంచరీ మార్కు చేరుకోవడం విశేషం. ఈ సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. 

తొలి భారత బ్యాట్స్మన్..
తాజా సెంచరీతో టీ20ల్లో న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ కొట్టిన తొలి భారతీయుడుగా సూర్య రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో  రెండు సెంచరీలు సాధించిన రెండో  భారత బ్యాట్స్మన్ గా నిలిచాడు. 2018 లో రోహిత్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండుసెంచరీలు చేశాడు. 

పాక్ కెప్టెన్ రికార్డు బద్దలు
కివీస్ పై చేసిన సెంచరీతో  సూర్య అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక 50  ప్లస్‌ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్ రికార్డు నెలకొల్పాడు. 2022లో  సూర్యకుమార్ ఇప్పటి వరకు 11 సార్లు 50  ప్లస్‌ స్కోర్లు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు  బాబర్‌ ఆజమ్ పేరిట ఉండేది. అతను ఈ ఏడాదిలో 10 సార్లు 50 ప్లస్ స్కోరు సాధించాడు. ఈ రికార్డును సూర్యకుమార్‌ బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. 2021లో రిజ్వాన్‌ 13 సార్లు 50  ప్లస్‌ స్కోర్లు సాధించాడు.