IND vs SA: నేను ఫామ్‌లోనే ఉన్నాను.. సూర్య వింత సమాధానానికి ఫ్యాన్స్ షాక్

IND vs SA: నేను ఫామ్‌లోనే ఉన్నాను.. సూర్య వింత సమాధానానికి ఫ్యాన్స్ షాక్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2025లో పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్నాడు. ఏ ఏడాది సూర్య ఫామ్ ఘోరంగా ఉంది. కెప్టెన్ గా జట్టును ఆదుకోవాల్సిన సూర్య చేతులెత్తేస్తున్నాడు. కెప్టెన్ గా అదరగొడుతున్నా.. బ్యాటర్ గా పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఆసియా కప్, ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లో ఘోరంగా విఫలమైన ఈ టీమిండియా కెప్టెన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో పరుగులు చేయడానికి శ్రమిస్తున్నాడు. ఆడిన మూడు టీ20 మ్యాచ్ ల్లో వరుసగా 12,5,12 పరుగులు చేసి విఫలమయ్యాడు. సూర్య ఫామ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఓ వైపు తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ సూర్య మాత్రం తాను ఫామ్ లోనే ఉన్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని ఈ ముంబై బ్యాటర్ ఫామ్ లోనే ఉన్నానని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూడో టీ20లో సౌతాఫ్రికాపై ఇండియా విజయం సాధించిన తర్వాత ప్రెజెంటేషన్ కార్యక్రమంలో  సూర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. " నేను నెట్స్‌లో చాలా గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా కంట్రోల్ లో ఉన్న ప్రతిదాన్ని నేను ప్రయత్నిస్తున్నాను. రావాల్సిన టైమ్ లో పరుగులు వస్తాయి. నా దృష్టంతా పరుగులు చేయడంపైనే ఉంది. నేను పరుగులు చేయలేకపోతే ఫామ్ లో లేనని అర్ధం కాదు". అని సూర్య చెప్పుకొచ్చాడు. 

Also Read : అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌పై కుర్రాళ్ల పంజా

టీ20 క్రికెట్‌లో యాదవ్ ఫామ్ బాగా పడిపోయింది. 2025లో 20 మ్యాచ్‌ల్లో 213 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. యావరేజ్ 14.11కాగా.. స్ట్రైక్ రేట్ 120.41 కూడా దారుణంగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా ఆడిన తొలి మూడు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ లో 12 పరుగులు చేసిన సూర్య రెండో మ్యాచ్ లో కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో 12 పరుగులు చేసి నిరాశపరిచాడు. 

మూడో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ: 

సౌతాఫ్రికాతో ముగిసిన మూడో టీ20లో టీమిండియా విశ్వరూపం చూపించింది. సఫారీలను చిత్తుచిత్తుగా ఓడించి భారీ విజయాన్ని అందుకుంది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. మొదట బౌలర్లు చెలరేగి సఫారీలను స్వల్ప స్కోర్ కే ఔట్ చేయగా.. ఈజీ ఛేజింగ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ వేగంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి గెలిచింది.