Suryakumar Yadav: అతని కెప్టెన్సీలో ఆడకపోవడం నా కెరీర్‪లో లోటుగా మిగిలిపోయింది: సూర్య కుమార్ యాదవ్

Suryakumar Yadav: అతని కెప్టెన్సీలో ఆడకపోవడం నా కెరీర్‪లో లోటుగా మిగిలిపోయింది: సూర్య కుమార్ యాదవ్

టీమిండియా టీ20 స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అతి తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశాడు. వన్డే, టెస్టుల సంగతి పక్కన పెడితే పొట్టి ఫార్మాట్ లో మాత్రమే చెరిగి ఆడతాడు. ఐపీఎల్.. ఇంటర్నేషనల్ లో ఇప్పటికే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడి టీ20 క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. తన అసాధారణ బ్యాటింగ్ తో ఏకంగా ఇండియా టీ20 క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. ఇటీవలే ఆసియా కప్ అందించిన సూర్య.. 2026 టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. తన టీ20 కెరీర్ లో ఎన్నో ఘనతలు చూసిన సూర్య ఒక విచారం కూడా ఉందని తెలిపాడు.   

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడకపోవడం తన జీవితంలో అతి పెద్ద విచారంగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్.. ఐపీఎల్ లో ధోనితో కలిసి ఆడే అవకాశాన్ని పొందలేకపోవడం గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. " ధోనీ అంతర్జాతీయ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతని కెప్టెన్సీలో ఆడాలని అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. నేను అతనితో ఆడినప్పుడల్లా స్టంప్స్ వెనుక అతనిని చూశాను. అతను చాలా కూల్‌గా ఉండేవాడు. నేను ధోనీతో ఆడినప్పుడు అతని నుండి నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే.. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా కూల్ గా ఉండడం. 

ధోనీ ఆటలో ఏం జరుగుతుందో మొత్తం గ్రహిస్తాడు. అంతా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటాడు". అని JITO కనెక్ట్ 2025 సందర్భంగా సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ 2021 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అప్పటికే ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే సూర్య కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్, పూణే వారియర్స్ ఇండియా తరపున ఆడాడు. దీంతో వీరిద్దరూ కలిసి ఆడే అవకాశం రాలేదు. భవిష్యత్ లో కూడా ధోనీ కెప్టెన్సీలో సూర్య ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. ఐపీఎల్ లో ముంబైని వదిలి సూర్య.. చెన్నైని వదిలి ధోనీ వేరే జట్ల తరపున ఆడడం అసాధ్యంగానే కనిపిస్తుంది. 

ఈ సందర్భంగా సూర్య రోహిత్ కెప్టెన్సీ గురించి అతనితో గడిపిన అనుభవాలను గురించి తెలిపాడు. "రోహిత్ భాయ్ కెప్టెన్సీలో నేను చాలా ఐపీఎల్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనూ రోహిత్ నాయకత్వంలో ఆడాను. రోహిత్ ప్రతి ఒక్కరినీ సౌకర్యవంతంగా ఉంచే వ్యక్తి. అందరి యంగ్ స్టర్స్ కు అతనొక స్ఫూర్తి. ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. ఈ భిన్నమైన గుణాన్ని నేను రోహిత్ నుంచి నేర్చుకున్నాను". అని సూర్య తెలిపాడు.