తక్కువ ధరకే ఫర్నిచర్.. మోసపోయిన 250 మంది

తక్కువ ధరకే ఫర్నిచర్.. మోసపోయిన 250 మంది

సూర్యాపేట, వెలుగు: తక్కువ ధరకు ఫర్నిచర్‌‌ ఇస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ వ్యాపారి పరారయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ధరకు ఫర్నిచర్ ఇస్తామంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడా రోడ్డులో 25 రోజుల క్రితం గోల్డెన్ ఏజెన్సీ పేరుతో తమిళనాడుకు చెందిన అయ్యప్పన్ అనే వ్యక్తి  షాప్ ప్రారంభించాడు. షాపులో కొన్ని పేరున్న కంపెనీల బెడ్స్, సోఫాలు, కుర్చీలు, బల్లలతోపాటు అనేక రకాల హోం ఫర్నిచర్ ఉంచి భారీ ఎత్తున బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశాడు. తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికాడు. మొదట  డబ్బులు చెల్లించిన 250 మంది కస్టమర్లకు 12 రోజుల తరువాత నచ్చిన ఫర్నిచర్ 50 శాతం డిస్కౌంట్ తో ఇస్తామని చెప్పాడు.

దీంతో కొందరు రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించారు. 12 రోజుల తర్వాత వారికి ఫర్నిచర్ అందజేయడంతో చాలామంది స్కీంలో చేరారు. రెండు రోజులుగా షాప్ తాళాలు తీయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా నిర్వాహకులు డబ్బులతో ఉడాయించినట్లు తేలింది. దీంతో బుధవారం షాప్‌‌ వద్దకు చేరుకొని అందినకాడికి ఎత్తుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి షట్టర్లు క్లోజ్​చేసి తాళాలు వేశారు.  సుమారు 250 మంది దగ్గర ఫర్నిచర్ ఆర్డర్ కోసం రూ.75 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. నిర్వాహకులకు తెలుగు రాదని, తమిళంలో మాట్లాడారని బాధితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.