గృహలక్ష్మి కోసం రోడ్డెక్కిన మహిళలు

గృహలక్ష్మి కోసం రోడ్డెక్కిన మహిళలు
  • అధికార పార్టీ నేతలకే గృహలక్ష్మి ఇస్తరా?
  • మంత్రి జగదీశ్ రెడ్డి గోడ గడియారాలను తగులబెట్టిన మహిళలు
  • సూర్యాపేట దంతాల పల్లి రోడ్డుపై రాస్తారోకో 
  • రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం కొత్త తండాలో అధికార పార్టీ అధ్యక్షులు, అనుచరులకే గృహలక్ష్మి ఇచ్చారని, అర్హులైన పేదలకు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సూర్యాపేట దంతాలపల్లి మెయిన్  రోడ్డుపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి పేరిట నిర్వహించిన జగదీశన్న కప్  క్రీడల్లో గెలుపొందిన వారికి ఇచ్చిన గోడ గడియారాలను మహిళలు దహనం చేశారు. 

పోలీసులు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా మహిళలు ఆందోళన విరమించలేదు. వారితో మాట్లాడేందుకు వచ్చిన బీఆర్ఎస్  గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్నను వారు నిలదీశారు. అర్హులైన వారికి గృహలక్ష్మి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కాగా, ఆత్మకూర్ (ఎస్) మండలం గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు నెమ్మికల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్  రెడ్డి పాల్గొనేందుకు వస్తున్నారన్న సమాచారంతో కొత్త తాండ గ్రామస్తులు నెమ్మికల్ కు చేరుకున్నారు.


తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అర్హలందరికీ గృహలక్ష్మి అందిస్తామని, ఇండ్లు ఉన్నవారికి గృహలక్ష్మి మంజూరు చేస్తే వారి పేరు తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో మహిళలు తమ ఆందోళనను విరమించారు. 

బీఆర్ఎస్ నాయకుల బాహాబాహీ

ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గృహలక్ష్మి లబ్ధిదారులకు శనివారం మంత్రి జగదీశ్  రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేసి వెళ్లిపోయిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్  విషయంలో కొట్టుకున్నారు. కందగట్ల గ్రామ సర్పంచ్ ముద్దం శేషమ్మ  కుమారుడు మధుసూదన్ రెడ్డి ప్రొటోకాల్  పాటించకుండా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. దాంతోపాటు సర్పంచ్  వర్గానికే ఇళ్లు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొల్లే జానయ్య ప్రశ్నించడంతో  గొడవకు దారి తీసింది. ఇరు వర్గాల నాయకులు, సహచరులతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.