కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రమాదం

కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రమాదం
  • కమీషన్లు చూస్కున్నరు.. క్వాలిటీ వదిలేసిన్రు
  • సూర్యాపేటలో నేషనల్‌‌‌‌ కబడ్డీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోటీల ఏర్పాట్లలో కక్కుర్తి
  • పెండ్లి మండపాలు వేసే వాళ్లకు కాంట్రాక్టు
  • రూ. 7 కోట్లు ఖర్చు చేసినా నాణ్యత లేక కూలిన గ్యాలరీ 

సూర్యాపేట, వెలుగు: కమీషన్లకు కక్కుర్తి పడి క్వాలిటీని పట్టించుకోకపోవడం వల్లే సూర్యాపేటలో నేషనల్‌‌‌‌ కబడ్డీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోటీల కోసం కట్టిన గ్యాలరీ కూలిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 7 కోట్లు ఖర్చు పెట్టి 5 వేల సీటింగ్‌‌‌‌ కెపాసిటీతో కట్టిన గ్యాలరీ.. 1,500 మంది కూర్చుంటేనే పడిపోవడానికి స్థానిక లీడర్ల కమీషన్‌‌‌‌ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. అత్యంత నాసిరకంగా పనులు చేయడం వల్లే 263 మంది గాయాలపాలవ్వాల్సి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. 
అనుభవం లేనివాళ్లకు పనులు
టోర్నమెంట్ కోసం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్, మంత్రి జగదీశ్​రెడ్డి తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు. ఏర్పాట్లకు రూ.7 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా రూ. 20 లక్షలను ప్రభుత్వం రిలీజ్​చేసింది. మిగిలిన ఫండ్స్‌‌‌‌ను 25 కంపెనీలు స్పాన్సర్ చేశాయి. మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డి అనుచరులు కమీషన్ కోసం నాణ్యత లేకుండా పనులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.1.2 కోట్లతో ఆడియన్స్ గ్యాలరీ కోసం ఎస్టిమేషన్ వేయగా తమ కమీషన్లు మినహాయించుకొని రూ. 80 లక్షలకు అసలేం అనుభవం లేని శివసాయి ఫ్లవర్‌‌‌‌ డెకరేషన్స్‌‌‌‌కు గ్యాలరీల ఏర్పాటు పనులను అప్పగించారు. అధికార పార్టీ నేతలు చెప్పారని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఆఫీసర్లు కూడా ఎక్స్‌‌‌‌పీరియన్స్ సర్టిఫికెట్ లేకున్నా పనులను అప్పగించారు. గ్యాలరీ పనులు పూర్తయ్యాక ట్రయల్స్ కూడా నిర్వహించలేదు.  
కర్రలు సపోర్టు​పెట్టి..
ప్రమాదానికి కాంట్రాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. గ్యాలరీ ఏర్పాటు సమయంలో సపోర్టు కోసం ఏర్పాటు చేసే బేస్‌‌‌‌ను 2 ఫీట్ల లోపలికి తవ్వాల్సి ఉండగా అదేం లేకుండా కర్రలను సపోర్టుగా బట్టలతో చుట్టేశారని, దీని వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. కాంట్రాక్టర్, క్రీడల నిర్వాహకులపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇండోర్‌‌‌‌ స్టేడియంలో పెట్టాల్సిన పోటీలను వసతుల్లేని పోలీస్ పరేడ్​గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించడంపై క్రీడాకారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
263 మంది కి గాయాలు
గ్యాలరీ కూలిన టైమ్‌‌‌‌లో సుమారు 1,500 మంది ఆడియన్స్ ఉన్నారు. 263 మంది గాయపడగా 86 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లలో 44 మందిని హైదరాబాద్ తరలించగా 42 మందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు. చాలా మందికి కాళ్లు, చేతులు విరిగాయి3 గ్యాలరీలను ఏర్పాటు చేయగా వాటిలో సౌత్ సైడ్ గ్యాలరీ కూలిపోవడంతో మిగిలిన రెండింటినీ నిర్వాహకులు మంగళవారం తొలగించి టెంట్లు, కుర్చీలు వేశారు. 
బాధితులకు మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్: జగదీశ్‌‌‌‌రెడ్డి 
గ్యాలరీ కూలిన ఘటనలో గాయపడ్డవారికి అండగా ఉంటామని, మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తామని మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్న బాధితులను మంత్రి మంగళవారం పరామర్శించారు. గాయపడిన వారిలో80 శాతం మంది ఇప్పటికే డిశ్చార్జ్‌‌‌‌ అయ్యారన్నారు. 
సీబీఐ ఎంక్వైరీ చేయించాలి: సంకినేని
ఈ ఘటనపై సీబీఐతో ఎంక్వైరీకి చేయించాలని, కలెక్టర్‌‌‌‌ను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం హాస్పిటల్‌‌‌‌లో బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. గాయపడిన వారికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

ట్రీట్మెంట్ అందక బాధితుల పాట్లు
గ్యాలరీ ఘటనలో గాయపడిన వాళ్లకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నామని, సూర్యాపేటలోని ప్రైవేట్​ హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నోళ్లకు ఫ్రీగా ట్రీట్ మెంట్​అందించాలని డాక్టర్లకు మంత్రి జగదీశ్​రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. కానీ, టెస్టుల పేరిట హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయని బాధితులు అంటున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో సరైన ట్రీట్​మెంట్​ అందక చాలా మంది బాధితులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్​మెంట్​ 
పొందుతున్నారు. 

గ్యాలరీ కూలడంతో మా బావ  హనీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్  నిమ్స్ లో చేర్పించినం. డాక్టర్లు పట్టించుకోలే. టెస్టులకే రూ.12వేలు అయినయి. చేసేది లేక యశోద హాస్పిటల్‌ తీసుకెళ్తే ఆపరేషన్ కు రూ.4లక్షలు ఖర్చయితదని  అక్కడి డాక్టర్లు చెప్పారు. ఆఫీసర్లు రూ.50వేలే  ఇచ్చారు. మాకు పూర్తి పైసలియ్యాలె.-చాంద్ పాషా, సూర్యాపేట