ఎల్బీనగర్, వెలుగు: బంగారం, గ్రానెట్ బిజినెస్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న సూర్యాపేట జిల్లా మునగాల సీఐ రామకృష్ణారెడ్డి భార్యతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లాకు చెందిన మునగాల సీఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి తాను బంగారం బిజినెస్ చేస్తున్నానని చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న బంగారాన్ని తక్కువ ధరకు కొని అమ్ముతున్నానని చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడింది. హైదరాబాద్ నాగోల్ పీఎస్ లో రెండు కేసులు, ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం పీఎస్ లలో ఒక్కో కేసు నమోదవగా, తాజాగా హయత్ నగర్ లో నమోదైన కేసులో ఆమెను అక్కడి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
నాగోల్ లో నివాసం ఉంటున్న కవితారెడ్డి బోటిక్ బిజినెస్ చేస్తోంది. తన వద్దకు వచ్చే కష్టమర్లతో పాటు పరిచయం ఉన్నవాళ్లకు తక్కువ ధరకు బంగారం వస్తోందని డబ్బులు అర్జంట్ గా అవసరమని చెప్పి మోసం చేసింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన పిల్ల మధు కారును ఎంగేజ్ కు తీసుకొని అతడినే డ్రైవర్ గా పెట్టుకుంది.
అతడికి బంగారం గురించి చెప్పి డబ్బులు అర్జెంట్ గా అవసరం ఉన్నాయని, ఆ తరువాత ఎక్కువ డబ్బులు ఇస్తానని నమ్మించడంతో వినోద్ అనే ఈవెంట్ మేనేజర్ వద్ద రూ.13లక్షలు ఇప్పించాడు. ఇలాగే తెలిసిన వారి వద్ద మరో రూ.30 లక్షలు ఇప్పించాడు. ఈక్రమంలో సుధారెడ్డి అనే ఫ్రెండ్ను తీసుకొచ్చి గ్రానెట్ వ్యాపారం చేస్తుందని నమ్మించింది. ఆ తరువాత తన భర్త సీఐ అని కేసులు పెట్టిస్తానని బెదిరించడంతో బాధితులంతా కలిసి హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.
