బీజేపీ లీడర్​ కిడ్నాప్​పై వీడిన సస్పెన్స్

బీజేపీ లీడర్​ కిడ్నాప్​పై వీడిన సస్పెన్స్
  • ఒడిశా బార్డర్​లో  గుర్తించిన పోలీసులు 
  • పోలీసులు అదుపులో కిడ్నాపర్లు 
  • నేడు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం 

మహదేవపూర్, వెలుగు : మూడు రోజుల కింద కిడ్నాప్ కు గురైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి సూరం మహేశ్​ ను పోలీసులు రక్షించారు. బుధవారం పనిపై మహారాష్ట్రలోని సిరివంచ తాలూకాలో పనిపై వెళ్లిన మహేశ్​తర్వాత కనిపించకుండా పోయాడు. డబ్బుల కోసం కిడ్నాపర్ల ఫోన్లు, పోలీసుల వేట కలిసి సస్పెన్స్ ​థ్రిల్లర్ ​మూవీని తలపించగా ఎట్టకేలకు ఒడిశా బార్డర్ లో మహేశ్​ ఉన్నట్టు గుర్తించి క్షేమంగా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఐదుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలను శనివారం వెల్లడించనున్నారు.

జరిగింది ఇది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేశ్​ బుధవారం ఉదయం మహేశ్​ తనకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరివంచ తాలూకాలో ఉన్న కొత్తపల్లిలో బ్యాంక్ పని ఉందని బైక్​పై వెళ్లాడు. మధ్యాహ్నం ఫ్రెండ్​కు ఫోన్​ చేసి తన బైక్​ను మేడిగడ్డ బ్యారేజీ ఆవల(మహారాష్ట్ర వైపు) పోచంపల్లి అడవి సమీపంలో పార్క్​చేశానని, తనకు వేరే పని ఉండి వెళ్తున్నానని, తీసుకువెళ్లాలని కోరాడు. సాయంత్రం అక్కడికి వెళ్లేసరికి బండి ఆన్​లో ఉండి కింద పడేసి ఉంది. మహేశ్​కు ఫోన్​ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కుటుంబసభ్యులకు చెప్పగా మహేశ్​ భార్య బుధవారం రాత్రి పోలీసులకు కంప్లయింట్​ఇవ్వడానికి వెళ్లింది. కానీ కిడ్నాప్​ జరిగింది వేరే రాష్ట్రంలో కాబట్టి తాము కంప్లయింట్ తీసుకోలేమని మహదేవపూర్ ​పోలీసులుచెప్పారు.   చివరికి ఎస్పీతో మాట్లాడించిన తర్వాత ఫిర్యాదు తీసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు. 

థ్రిల్లర్​ మూవీని తలదన్నేలా...
బుధవారం కిడ్నాప్​ చేసిన తర్వాత గురువారం ఉదయం రూ.2 లక్షలు మహేశ్​ ఎకౌంట్ ​నుంచి కిడ్నాపర్​గా భావిస్తున్న వ్యక్తి అకౌంట్​కు ట్రాన్స్ ఫర్​అయినట్టు పోలీసులు గుర్తించారు. మహేశ్ మొబైల్ ​సిగ్నల్స్​ ట్రేస్​ చేయగా ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్లి వెతుకుతుండగా తెలుసుకున్న కిడ్నాపర్లు మహేశ్​కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి మహేశ్​తో మాట్లాడించారు. పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని, లేకపోతే తనను చంపేస్తారని చెప్పాడు. రూ.50 లక్షలిస్తేనే వదిలేస్తానని అంటున్నారని చెప్పి ఫోన్​ కట్​చేశాడు. పోలీసులు ఫోన్​ చేసిన లొకేషన్​కు గంటలో వెళ్లగా ఎవరూ కనిపించలేదు. ట్రేస్​ చేస్తే 150 కిలోమీటర్ల దూరంలో లొకేషన్ ​కనిపించింది. ఈ లోపు మహేశ్​కుటుంబసభ్యులు కిడ్నాపర్లలో ఒకరిని పట్టుకోగా, మళ్లీ ఫోన్​ చేసి అతడిని విడిచిపెట్టకపోతే మహేశ్​ను చంపేస్తామని బెదిరించారు. దీంతో అతడిని వదిలేసి రూ.10 లక్షలు ఇస్తామనడంతో ఒప్పుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు కిడ్నాపర్లకు చెందిన రెండు మూడు ఎకౌంట్లకు మహేశ్ కుటుంబసభ్యులు రూ.8.5 లక్షలు ట్రాన్స్​ఫర్​ చేశారు. మరో రూ.లక్షా యాబై వేలను రెడీ చేసుకుంటుండగానే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని మహేశ్​ను రక్షించారు.  

ఇంతకుముందూ బెదరింపు కాల్స్​
ఆరు నెలల్లో మహేశ్​కు అతడి భార్యకు నాలుగైదు సార్లు డబ్బులివ్వాలని బెదిరింపు కాల్స్​వచ్చాయని తెలిసింది. కానీ సీరియస్​గా తీసుకోకపోవడంతో అన్నంత పని చేశారు. శుక్రవారం మంథని బీజేపీ ఇన్​చార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి మహేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.