11 మంది మెడికోలపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత

11 మంది మెడికోలపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత
  • గాంధీ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌‌కు పాల్పడిన విద్యార్థులపై కాలేజీ యాంటీ ర్యాగింగ్‌‌ కమిటీ సస్పెన్షన్‌‌ ఎత్తివేసింది. కాలేజీ ప్రిన్సిపాల్, కమిటీ చైర్మన్‌‌ రమేశ్​ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌‌ కమిటీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

4 నెలల క్రితం గాంధీ మెడికల్‌‌ కాలేజీలో తోటి మెడికోలపై ర్యాగింగ్‌‌కు పాల్పడిన 11 మంది వైద్య విద్యార్థులను నేషనల్‌‌ మెడికల్‌‌ కౌన్సిల్‌‌ (ఎన్‌‌ఎంసీ) ఆదేశాల మేరకు కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పలుమార్లు అభ్యర్థించడంతోపాటు మరోమారు ర్యాగింగ్‌‌కు పాల్పడబోమని రాతపూర్వకంగా విజ్ఞప్తులు చేశారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌‌ను దృష్టిలో ఉంచుకుని యాంటీ ర్యాగింగ్‌‌ కమిటీ సమావేశమైంది. నెల రోజుల్లో  పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులపై సస్పెన్షన్‌‌ ఎత్తివేయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే, హాస్టల్‌‌లో ఉండేందుకు మాత్రం నిరాకరించింది. సస్పెన్షన్‌‌కు గురైన విద్యార్థులతో కమిటీ ప్రతినిధులు డైరెక్ట్​గా మాట్లాడారు.

మరోమారు ర్యాగింగ్‌‌కు పాల్పడితే కళాశాల నుంచి పర్మినెంట్ గా తొలగించి, పోలీసులకు కంప్లెంట్  చేసి కేసులు నమోదు చేస్తామని వార్నింగ్​ ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీ మెడికల్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ రమేశ్​ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్​ను కాపాడేందుకు వారిపై ఉన్న సస్పెన్షన్‌‌ను ఉపసంహరించుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ర్యాగింగ్‌‌ ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. వైస్‌‌ ప్రిన్సిపాల్‌‌ కృష్ణమోహన్, గాంధీ సూపరింటెండెంట్‌‌ రాజారావు, పలు విభాగాల హెచ్‌‌వోడీలు సమావేశంలోపాల్గొన్నారు