12మంది ఎంపీల సస్పెన్షన్

12మంది ఎంపీల సస్పెన్షన్
  • సభా కార్యక్రమాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నందుకు వేటు

న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్షాల సభ్యులు సస్పెండ్ అయ్యారు. గత వర్షాకాల సమావేశాల్లో సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డు తగిలారని విపక్షాలకు చెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తోపాటు లెఫ్ట్ పార్టీలు, తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన 12 మంది ఉద్దేశ పూర్వకంగా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని, సభాధ్యక్షుని అధికారాన్ని ఏమాత్రం గౌరవించకుండా అడ్డుకున్నారంటూ వీరిని సస్పెండ్‌ చేశారు. మొత్తం శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరి సస్పెన్షన్‌ అమల్లో ఉంటుంది. సస్పెండ్‌ అయిన ఎంపీలు...
రాజామణి పటేల్‌ (కాంగ్రెస్‌)
సయ్యద్‌ నసీర్‌ హుసేన్‌ (కాంగ్రెస్‌)
డోలా సింగ్‌ (కాంగ్రెస్‌)
ఫూలో దేవి నేతం (కాంగ్రెస్‌)
ఛాయా వర్మ (కాంగ్రెస్‌)
రిపు బొరా (కాంగ్రెస్‌)
అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌ (కాంగ్రెస్‌)
శాంతా ఛెత్రి (టీఎంసీ)
ఎలామరం కరీమ్‌ (సీపీఎం)
బినయ్‌ విశ్వం (సీపీఐ)
ప్రియాంక చౌదరి (శివసేన)
అనిల్‌ దేశాయ్‌ (శివసేన).

ఏకపక్ష ప్రతీకార నిర్ణయంతో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: కాంగ్రెస్ ఎంపీ
తమపై సస్పెన్షన్ వేటు వేయడంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రిపున్ బోరా స్పందించారు. ఇది ఏకపక్ష, పక్షపాత, ప్రతీకార నిర్ణయమని ఆరోపించారు.  ప్రతిపక్షాలను ఏ మాత్రం సంప్రదించలేదన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు. ప్రతిపక్ష సభ్యుల గొంతు వినిపించే అవకాశమే ఇవ్వలేదని ఆరోపించారు.