నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు..

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు..

లోక్​సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్​ను స్పీకర్ ఓం బిర్లా ఎత్తివేశారు. మాణిక్కం ఠాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతి మణిలపై విధించిన సస్పెన్షన్ను  ఎత్తివేయాలన్న తీర్మానాన్ని  మిగతా సభ్యులు ఆమోదించారు.  వర్షకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్ ఎంపీలు ద్రవ్యోల్భణం, నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు పలు సమస్యలపై  నిరసన తెలియజేశారు.  అయితే సభలో ఆందోళన చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. మాణిక్కం ఠాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిలపై సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ సస్పెన్షన్ విధించారు. అయితే వీరి ప్రవర్తనపై కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. సభాపతిని అవమానించాలన్నది సభ్యుల ఉద్దేశం కాదని చెప్పారు. చివరకు నలుగురిపై విధించిన సస్పెన్షన్ను సభాపతి ఎత్తివేశారు.

 

సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దు..
కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.. సభ్యులకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. సభలోకి ఎలాంటి ప్లకార్డులు తీసుకురావద్దని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే  కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.  ఒక వేళ సభ్యులు నిరసన తెలపాలనుకున్నా..నినాదాలు చేయాలన్నా..లేదా ప్లకార్డులు ప్రదర్శించాలనుకున్నా..సభ బయట చేసుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు.