
హైదరాబాద్, వెలుగు : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పునిచ్చిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి కె జయశంకర్‌ను హైకోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీచేసిన శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్‌ను మార్చారని సీహెచ్ రాఘవేంద్రరాజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దీనిపై జులై 31న విచారణ జరిపిన జడ్జి జయశంకర్.. ఎన్నికల అధికారులతోపాటు శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
అయితే, వారు కేసు ఫైల్ చేయకపోవడంతో రాఘవేంద్రరాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని జడ్జి హెచ్చరించారు. జడ్జి మౌఖిక ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, మహబూబ్‌నగర్‌లో ఎన్నికల అధికారులుగా పనిచేసిన వారితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా మొత్తం పది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఈసీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. జడ్జి తన పరిధిని అతిక్రమించి ఉత్తర్వులు ఇచ్చారని, అడ్మినిస్టేషన్ హెడ్‌గా హైకోర్టు ఈ అంశంపై విచారణ చేసి పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విచారణ చేపట్టి చీఫ్ జస్టిస్ కు నివేదిక సమర్పించారు.
సీఆర్‌పీసీలోని సెక్షన్ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ఫిర్యాదు తర్వాత జడ్జి ప్రాథమిక విచారణ చేయకుండా, వాంగ్మూలాన్ని నమోదు చేయకుండా అదే సెక్షన్‌లోని సెక్షన్ 15(3) కింద దర్యాప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారని నివేదికలో పేర్కొన్నారు. దీంతో జడ్జిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. ఈసీ ఫిర్యాదును పాలనాంశంగా పరిగణించి మంగళవారం జడ్జి జయశంకర్‌ను సస్పెన్షన్‌లో పెట్టింది. పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదనే కారణంతో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్ వదలివెళ్లకూడదని ఆదేశించింది.