బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు కాలేజీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అకౌంట్ సెక్షన్‭కి చెందిన ఇద్దరు ఉద్యోగులను.. ఇంచార్జ్ విసి వెంకటరమణ సస్పెండ్ చేశారు. విధులు ఉల్లంఘన, యూనివర్సిటీకి సంబందించిన విషయాలు బయటికి లీక్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకున్నారు. అలాగే.. ఓ విద్యార్థిని వేధిస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో విచారణ కొనసాగుతుండగానే ఇద్దరు ఉద్యోగులపై ఇంచార్జి వీసీ  సస్పెన్షన్ వేటు వేశారు. అయితే.. దీనిపై పూర్తిస్థాయి నివేదిక సోమవారం రానుంది. నివేదిక వచ్చిన వెంటనే ఇద్దరు ఉద్యోగులపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఉద్యోగుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాలేజీ యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి.. విద్యార్థిని తన దగ్గరి బంధువు అని అందుకే పలుకరించేవాడినని చెప్పాడు. దీనిపై ఉద్యోగి భార్యను కాలేజీకి పిలిపించి అడగ్గా ఆమె విద్యార్థునులతో తమకు బంధుత్వం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో ఉద్యోగికి సంబంధం ఉన్నట్లు తెలియడంతో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అటు.. వారు విధులు నిర్వర్తించే సెక్షన్‌లో అవకతవకలకు పాల్పడినందుకు వేటు వేసినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి.