సీఎం సొంత జిల్లాలో వారంలో ఇద్దరు తహసీల్దార్ల సస్పెన్షన్

సీఎం సొంత జిల్లాలో వారంలో ఇద్దరు తహసీల్దార్ల సస్పెన్షన్
  • ఫార్మ్​ల్యాండ్ వెంచర్ల రిజిస్ట్రేషన్లకు భారీగా వసూళ్లు 
  • ఒక్కో రిజిస్ట్రేషన్​కు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు 

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో అవినీతికి ఆస్కారం లేని విధంగా పారదర్శక సేవలు అందించేందుకే ధరణి పోర్టల్ తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రకటించినప్పటికీ.. ఆ శాఖను అవినీతి చీడ వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు, పెండింగ్​ మ్యుటేషన్లు, విరాసత్ సక్సేషన్లు, కోర్టు ఆర్డర్ల ఇంప్లిమెంటేషన్ కు కొందరు తహసీల్దార్లు అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్కో సర్వీస్​కు ఒక్కో రేటు కట్టి ధరణి ఆపరేటర్లు, మీసేవ సెంటర్ల నిర్వాహకుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. ధరణి రికార్డుల్లోని లోపాలు, ఆర్ఎస్ఆర్ లో తేడాలు, 20 గుంటలలోపు భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దని మున్సిపల్ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు, కుటుంబ సభ్యుల మధ్య భూవివాదాలు తదితర సమస్యలు వారికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్లకు డబ్బులు డిమాండ్ చేస్తూ కెమెరాకు చిక్కడం, ఇతర జిల్లాల్లోనూ పలువురు తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు రావడం, కేసులు నమోదు కావడం ధరణి వచ్చినా.. లంచాలు రెవెన్యూ శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పోలేదని చెబుతున్నాయి. 

ఫార్మాలిటీగా మారిన లంచం.. 

ధరణిలో స్లాట్ ​బుక్ ​చేసుకొని రిజిస్ట్రేషన్​ కోసం వెళ్తున్న వారికి ఏదో ఒక సాకు చెప్పి, ల్యాండ్ వాల్యూను బట్టి ఎకరానికి ఇంత చొప్పున లేదా రిజిస్ట్రేషన్ కు రూ.1,000 నుంచి రూ.5 వేల  వరకు వసూలు చేయడం చాలా తహసీల్దార్​ఆఫీసుల్లో ఫార్మాలిటీగా మారింది. కొన్నిచోట్ల డిమాండ్ చేయడం, మరికొన్ని చోట్ల ఎంతోకొంత సంతోషంగా ఇచ్చి వెళ్లండని స్మూత్ గా చెప్పడం మామూలైపోయింది. చాలా చోట్ల స్లాట్ బుకింగ్ టైమ్​లోనే  తహసీల్దార్ కు ఇచ్చే డబ్బులతో కలిపే మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు రిజిస్ట్రేషన్​చార్జీలు వసూలు చేస్తున్నారు.

ఫార్మ్​ల్యాండ్ వెంచర్లలో..

రాష్ట్ర మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 20 గుంటలలోపు వ్యవసాయ భూములను గుంటల చొప్పున రిజిస్ట్రేషన్​ చేయొద్దని 2021 జులై 9న సర్క్యులర్​ జారీ చేసిన విషయం తెలిసిందే. లేఔట్ అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి అమ్మడాన్ని ఆపేందుకే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సర్క్యులర్ ఇప్పుడు తహసీల్దార్లకు కాసులు కురిపిస్తోంది. లేఔట్ అనుమతుల కోసం  ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడంతో పాటు చాలా నిబంధనలు పాటించాల్సి ఉండటంతో కొందరు రియల్టర్లు వ్యవసాయ భూములను ఫార్మ్ ల్యాండ్స్ పేరిట రెండు గుంటలు, మూడు గుంటలను ఒక ప్లాటుగా చేసి అమ్మేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా వర్తిస్తుందంటూ ఆశచూపి కొనేలా చేస్తున్నారు. ఇలాంటి ఫార్మ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు వరంగా మారాయి. గుంట, రెండు గుంటలు రిజిస్ట్రేషన్​ చేయడానికి వీల్లేదని కొర్రీలు పెట్టడంతో ఒక్కో ప్లాట్​ రిజిస్ట్రేషన్​కు రియల్టర్లే రూ.10 వేల నుంచి రూ.20 వేలు సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

వారసత్వ భూములకూ..

తల్లిదండ్రులు చనిపోతే ధరణి పోర్టల్​లో ఉన్న వారి భూములను వారసుల పేరిట విరాసత్ చేసుకునేందుకు అవకాశముంది. అయితే ధరణి పోర్టల్ రాక ముందు ఇలా విరాసత్ చేయాలంటే వారసత్వానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అడిగేవారు. ధరణి పోర్టల్ వచ్చాక కేవలం సెల్ఫ్ డిక్లరేషన్​ సమర్పిస్తే ఎలాంటి విచారణ లేకుండానే విరాసత్ చేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు తమ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన తల్లిదండ్రులకు తాను ఒక్కడినే కుమారుడినంటూ సెల్ఫ్​ డిక్లరేషన్​ఇచ్చి ఒక్కరి పేరు మీదే భూమినంతా విరాసత్ చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్లకు డబ్బులిచ్చి మేనేజ్​ చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.