రాష్ట్రంలో కరోనా మరణాలను దాచేస్తున్నరా?

రాష్ట్రంలో కరోనా మరణాలను దాచేస్తున్నరా?
  • రాష్ట్రంలో కరోనా మృతుల లెక్కలపై అనుమానాలు
  • తక్కువ చేసి చూపిస్తున్నరని ఆరోపణలు
  • లెక్కల్లో చూపించట్లేదంటున్న మృతుల ఫ్యామిలీలు
  • గత 10 రోజుల్లో ముగ్గురి మరణం.. లెక్కల్లోకి ఎక్కలే
  • మున్ముందు పరిహారం ఇస్తే అందదంటున్న ఎక్స్‌‌పర్ట్స్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా చావుల లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వారి మరణాలను లెక్కల్లో చూపించలేదని ప్రభుత్వాన్ని ఇప్పటికే కొందరు కుటుంబీకులు ప్రశ్నించిన దాఖలాలున్నాయి. సోషల్‌‌ మీడియా వేదికగా కూడా అడిగిన సంఘటనలూ ఉన్నాయి. గత 10 రోజుల్లో ముగ్గురు కరోనాతో చనిపోయినా ఆ వివరాలను ఇప్పటికీ సర్కారు వెల్లడించకపోవడం ఈ ఆరోపణలకు బలమిస్తోంది.

అసిఫ్‌‌నగర్‌‌ వ్యక్తి మరణం చేర్చలే

మే 2న కరోనా మరణాలు 29 చేరాయని సర్కారు పేర్కొంది. హైదరాబాద్‌‌ అసిఫ్‌‌నగర్‌‌‌‌కు చెందిన వై. రాజు ఈ నెల 5న గాంధీలో మృతి చెందాడు. కానీ ఆ రోజు మరణాల లెక్కల్లో కొత్తవి చేర్చలేదు. ఈ నెల 8 వరకూ మరణాలను 29గానే చూపారు. 9న సరూర్‌‌‌‌నగర్‌‌కు చెందిన ఓ వృద్ధుడు గాంధీలో చనిపోయాడు. ఆ రోజు బులెటిన్‌‌లో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడంటూ మరణాలను 30గా చూపారు. దీంతో రాజు మరణాన్ని ఎందుకు ప్రకటించలేదో మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. మృతుని భార్య గాంధీలోనే ఉన్నారు. ఒకటిన గాంధీలో  అడ్మిట్ అయ్యామని, 5న భర్త మృతి చెందాడని ఆమె చెప్పారు.

మరో ఇద్దరి విషయంలోనూ..

పురానాపూల్‌‌లోని సాయిదుర్గానగర్‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన వృద్ధురాలి విషయంలోనూ ఇట్లే జరిగింది. బెల్దె శ్రీనివాస్‌‌ (51) అనే వ్యక్తికి కరోనా రావడంతో ఈ నెల 9న గాంధీలోలో చేరారు. 10న పొద్దున మరణించాడు. 10నే సరూర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన 65 ఏండ్ల వృద్ధురాలు పుణ్యవతి కూడా మృతి చెందింది. కానీ  10, 11 నాటి బులెటిన్లలో కొత్త మరణాలు పేర్కొనలేదు. మరణాలను 30గానే చూపారు. 12 నాటి బులెటిన్‌‌లో కరోనాతో మూసాబౌళికి చెందిన వృద్ధుడు (61), జియాగూడకు చెందిన మరో వృద్ధుడు (65) చనిపోయినట్టు పేర్కొన్నారు. మరణాలను 32గా చూపారు. ఇందులో శ్రీనివాస్‌‌ మరణాన్ని, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన వృద్ధురాలి మరణాన్ని చేర్చలేదు. గాంధీలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న వృద్ధురాలి భర్త, ఈ నెల 13న మరణించాడు. ఆ రోజున విడుదల చేసిన బులెటిన్‌‌లో వృద్ధునితో పాటు జియాగూడకు చెందిన ఓ మహిళ (38) చనిపోయినట్టు పేర్కొన్నారు. మరణాలను 34గా చూపారు. 14, 15 నాటి బులెటిన్‌‌లోనూ మరణాలను 34గానే పేర్కొన్నారు. దీంతో శ్రీనివాస్, పుణ్యవతి, రాజు మరణాలు దాచినట్టు తెలుస్తోంది.

ఐసీఎంఆర్ ఏం చెప్పింది?

కరోనా మరణాల లెక్కల్లో పారదర్శకత పాటించా లని, అలాగైతేనే వైరస్ ప్రభావాన్ని సరిగా అంచనా వేయగలమని చెప్పింది. గైడ్​ లైన్స్​ ఇచ్చింది. నిమో నియా, కార్డియాక్ ఇంజురీ వంటి రోగాలతో బాధపడుతున్న వాళ్లు కరోనాతో మరణిస్తే కరోనా మృతి కిందే చూపాలంది. మరణానికి కారణమేదైనా పాజిటివ్‌‌  తేలితే కరోనా మృతి కిందే చూపాలంది. కానీ రాష్ర్టంలో ఇవి ఫాలో కావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. భవిష్యత్తులో కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలనుకుంటే మృతుల కుటుంబాలకు అందదని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.

 చివరి చూపు కూడా దక్కలె

నా భర్త షుగర్ పేషెంట్‌‌. దమ్ము ఎక్కువ వస్తుండటంతో ఈ నెల ఒకటిన గాంధీకి వచ్చినం. రెండ్రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అని చెప్పి కరోనా పేషెంట్ల వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఐదున ఆయన చనిపోయాడని చెప్పారు. చివరి చూపు కూడా చూసుకోనివ్వలేదు.

– మృతుడు వై. రాజు భార్య

డెత్​ సర్టిఫికెట్​ ఇవ్వలె

మా తమ్ముడు శ్రీనివాస్‌‌కు హార్ట్ ప్రాబ్లమ్‌‌. ఓ ప్రైవేటు హాస్పిటల్‌‌కు పోతే కరోనా టెస్టులు చేయించారు. పాజిటివ్ రావడంతో ఈ నెల 9న గాంధీకి షిఫ్ట్ చేశారు. ఆయన వెంట ఉన్న నాకూ పాజిటివ్ వచ్చింది. పదో తేదీన ఆయన చనిపోయిండు. బులెటిన్‌‌లో రాలేదని మా కొడుకు ట్విటర్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌కు పెట్టినా స్పందించలేదు. డెత్ సర్టిఫికెట్ అడిగినా ఇవ్వలేదు.

– మృతుని సోదరుడు

టెస్టులు సక్కగ చేస్తలేరు

మా నాన్న మోహన్‌‌రెడ్డి డయాలిసిస్‌‌ పేషెంట్‌‌. 29న కరోనా సోకిందని తేలడంతో గాంధీకి షిఫ్ట్ చేశారు. దగ్గు రావడంతో మే 10న వచ్చి అమ్మను కింగ్ కోఠి హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. తర్వాత రోజు అమ్మ పరిస్థితి విషమించిం దని గాంధీకి షిఫ్ట్‌‌ చేశారు. తర్వాత కాసేపటికే అమ్మ చనిపో యింది. ఆమెకు పాజిటివ్ వచ్చిం దన్నారు. 13న నాన్న చనిపోయారు. నాన్న మరణించినట్టు బులెటిన్‌‌లో చెప్పారు. అమ్మ మరణించిన విషయం రాలేదు.

–బాధిత దంపతుల కొడుకు, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌

 

చైనాను దాటేసిన ఇండియా