గోదావరిఖని, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని.. అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను జేబు సంస్థలుగా మారుస్తున్నదని దుయ్యబట్టారు.
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వాలు అణగదొక్కుతున్నాయని, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా జోడే ఘాట్ నుంచి జీపుజాత ప్రారంభమవుతుందని .. ఈ నెల 16న గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాలకు వస్తుందన్నారు. డిసెంబర్ 26న ఐదు లక్షలమందితో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన వెంకట్ రెడ్డి కోరారు. ఈ మీటింగ్లో సీపీఐ లీడర్లు పాల్గొన్నారు.
